
ఉచిత బస్సుతో ఆటోస్టాండ్లు వెలవెల
చల్లపల్లి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించటంతో దాని ప్రభావం ఆటోలపై పడింది. ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆటోస్టాండు శనివారం వెలవెలబోయింది. ఆటోలన్నీ స్టాండులోనే ఉండిపోయాయి. ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం నుంచి సీ్త్రశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం ఆటో యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది. చల్లపల్లి బస్టాండు వద్ద ఉన్న ఆటో పాయింటులో 30కి పైగా ఉన్నాయి. ఇవి నిత్యం అవనిగడ్డ, రేపల్లె ప్రాంతాలకు నిరంతరం ప్రయాణికులను తీసుకువెళుతుంటాయి. ఒక్కొక్క ఆటో కనీసం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు వేసేది. మహిళకు ఉచిత బస్సు కారణంగా శనివారం ఒక్క ట్రిప్పు వేయటానికే గగనమైపోయిందని ఆబోవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు ఆద్దెకు తెచ్చి తిప్పుకునే వారికి కనీసం ఆటో అద్దె చెల్లించటానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొందని తమ గోడు విన్నవించుకుంటున్నారు. మండల కేంద్రమైన చల్లపల్లి పెదకళ్ళేపల్లి రోడ్డులో, ప్రధాన సెంటర్ వద్ద బందరు రోడ్డులో, పంచాయతీ ఆఫీసు వెనుక ఉన్న ఆటోస్టాండుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. భవిష్యత్తులో తమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలని వేడుకొంటున్నారు.
తొలిరోజే
ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్

ఉచిత బస్సుతో ఆటోస్టాండ్లు వెలవెల