
ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు
మచిలీపట్నంఅర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడనుందని కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు తెలిపారు. జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నాచౌక్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. జిల్లాలో ఆటో వృత్తిపై 50వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సుతో ఆటోల బాడుగలు తగ్గి, ఆదాయం ఉండదనే ఆందోళనలో ఆటో కార్మికులు ఉన్నారే కానీ, మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదన్నారు. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు, జీవో నంబర్ 21 రద్దు, రుణ సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. వాహన మిత్ర పథకం కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల సాయం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు, వాహన కొనుగోలుకు రూ.4 లక్షల సబ్సిడీతో వడ్డీ రహి త రుణాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నేతలు కె. దావీదు, ఎ. వెంక టేశ్వరరావు, కె. పోతురాజు, కరీముల్లా పాల్గొన్నారు.