
ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్‌లో తిరంగా బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్‌ఎం మోహిత్ సొనాకియా ర్యాలీని ప్రారంభించారు. ముందుగా దేశ సమగ్రత, అభివృద్ధికి కృషి చేస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు దేశ ఐక్యత, దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వానికి శక్తివంతమైన స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతరం క్లాక్ టవర్ నుంచి త్రివర్ణ పతాకాలతో స్టేషన్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కృష్ణా యూనివర్సిటీలో..
కోనేరుసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం అనే నినాదంతో మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు వీసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు