అమ్మనాన్న | - | Sakshi
Sakshi News home page

అమ్మనాన్న

Aug 13 2025 7:36 AM | Updated on Aug 13 2025 7:36 AM

అమ్మన

అమ్మనాన్న

కనకున్నా ‘కారా’

మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ మధురానుభూతి. వివాహమైనప్పటి నుంచి ‘అమ్మ’ అనే పిలుపు కోసమే తహతహలాడుతుంటారు. నవమాసాలు మోసి.. బిడ్డను కని.. పొత్తిళ్లలో ఎత్తుకున్న క్షణాన.. ఆ అమ్మ ఆనందం వర్ణనాతీతం. అయితే ఇటీవల కాలంలో మారుతున్న అలవాట్లు, జీవనశైలి, వయసు మీరిన తర్వాత వివాహం వంటి కొన్ని కారణాలతో అమ్మతనం అనేది చాలా మందికి అందని ద్రాక్షగా మారుతోంది. సమస్య భార్యలో ఉన్నా.. భర్తలో ఉన్నా.. నింద మాత్రం మహిళలే మోయాల్సిన పరిస్థితి సమాజంలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇది కుటుంబాల్లో చిచ్చురేపు తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది దంపతులు పిల్లల దత్తతపై ఆసక్తి చూపుతున్నారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ అని ఓ సినీ కవి రాసిన మాటలను గుర్తుచేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ముళ్లపొదల్లోని నవజాత శిశువులకు మరో జన్మనిచ్చి మురిసిపోతున్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): పిల్లలు కావాలని ప్రతి ఒక్క పైళ్లెన జంట కోరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అది అందరికీ సాధ్యం కావడం లేదు. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అది కూడా కొందరికే ఫలాన్నిస్తోంది. అలాంటి వారికి వరంలా మారింది పిల్లల దత్తత స్వీకరణ. కృష్ణా జిల్లాలో అనాథ పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కాలంలో 115 మందికి పైగా మంది దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దత్తతలో చట్టబద్ధత తప్పనిసరి..

దత్తత కార్యక్రమంలో భాగంగా ఎవరో ఒకర్ని దత్తత తీసుకుని తల్లిదండ్రుల సమ్మతితో తెచ్చుకున్నంత మాత్రాన అది చట్టప్రకారం దత్తత కాదు. దత్తత కావాలనుకునే దంపతులు తప్పనిసరిగా చట్టబద్ధంగా స్వీకరించాల్సి ఉంటుంది. అందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఎడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలి.

‘కారా’లో రిజిస్ట్రేషన్‌ ఇలా

దంపతులు సెంట్రల్‌ ఎడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) వారి www.cara.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం తల్లిదండ్రుల పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతో పాటు నివాస, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు, రూ. 6వేలు డీడీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం 48 గంటల్లోగా దంపతుల మొబైల్‌కు సమాచారం వస్తుంది. అనంతరం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నిర్వహణలో ఉండే శిశు గృహానికి వెళ్లి అక్కడున్న పిల్లలను చూసుకొని, రిజర్వు చేసుకునే అవకాశం ఉంది. శిశువు నచ్చిన తరువాత రూ. 40వేలు ఏజెన్సీకి చెల్లిస్తే, అన్ని ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం దత్తతకు వచ్చిన డాక్యుమెంట్లు అన్నీ స్థానిక ఫ్యామిలీ కోర్టులో సమర్పించి, దత్తత అధికారిక ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ శిశుగృహతో పాటు ఇతర చైల్డ్‌ కేర్‌ సొసైటీల్లో ఉన్న వారిని దత్తత తీసుకోవచ్చు.

46మంది దత్తత

కృష్ణా జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకూ 115 మంది దంపతులు పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా.. 46మందిని దత్తతు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు.

సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నిర్వహణలో మచిలీపట్నం నగరంలో ఉన్న శిశుగృహలో 18 మందికి గానూ 16 మందిని దత్తత తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మగ శిశువులు, 11 మంది ఆడశిశువులు ఉన్నారు. వీరిలో ఒకరు న్యూజిల్యాండ్‌, ఒకరు అమెరికాకు చెందిన వారు దత్తత తీసుకోగా.. మిగిలిన వారిని కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల వారు వీరిని దత్తత తీసుకున్నారు.

గన్నవరం మండలం రుద్రవరం గ్రామంలో కేర్‌ అండ్‌ షేర్‌ బాలల ఆశ్రమంలో ఐదుగురు శిశువులు ఉండగా వీరిలో అన్నా, చెల్లెళ్లు ఇరువురిని ‘కారా’ ద్వారా కెనడాకు చెందిన వారు రిజర్వు చేసుకున్నారు.

ప్రస్తుతం బందరులోని శిశుగృహలో ఇద్దరు, కేర్‌ అండ్‌ షేర్‌లో ముగ్గురు శిశువులు ఉన్నారు.

ఈ ఏడాది దత్తత ఇవ్వటంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.

దత్తత కోసం ఇంకా 50 దరఖాస్తులు కారా వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి ఉండగా.. ఏటా సుమారు 25 మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు తెలిపిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

సమయం ప్రకారం టీకాలు వేయించాలి..

దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సమయం ప్రకారం శిశువులకు వేయించాల్సిన టీకాలన్నీ తప్పనిసరిగా వేయించాలి. తరచూ పరీక్షలు నిర్వహించుకుంటే ఎదిగే పిల్లలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది. పిల్లల పట్ల ఔదార్యం ప్రదర్శిస్తే మానసికంగా పిల్లలు ఎదుగుతారు. అలాగే బలానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండాలి. సంతానం లేకపోవటం బాధ అనిపించినా.. దత్తత చేసుకోవటం ఓ వరంగా భావించాలి.

– ఎం. హారిక, పిల్లల వైద్య నిపుణురాలు, బందరు

అమ్మనాన్న 1
1/2

అమ్మనాన్న

అమ్మనాన్న 2
2/2

అమ్మనాన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement