
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, వీవీఐపీలు పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. కంటిజెన్సీ బృందాల కవాతు, ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను నిర్ధేశించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఐజీ ఐఎస్‌డబ్ల్యూ కె. ఆరిఫ్ హఫీజ్, డీసీపీ కేజీవీ సరిత, ఎస్‌వీడీ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
17న బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
మచిలీపట్నంటౌన్/గన్నవరం: ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక ఈనెల 17వ తేదీ విజయవాడ మధురానగర్‌లోని కేంద్రియ విద్యాలయం–1 గ్రౌండ్‌లో జరుగుతుందని ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ జట్ల సెలక్షన్లు అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సెలక్షన్లకు వచ్చే సబ్ జూనియర్ క్రీడాకారులు 2010 జనవరి 2, జూనియర్ క్రీడాకారులు 2006 జనవరి 2 తర్వాత జన్మించిన వారు ఉండాలని వివరించారు. సెలక్షన్స్‌కు వచ్చే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన సూచించారు.
జూనియర్ కళాశాలల్లో
అడ్మిషన్‌లు పెంచాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్‌లు పెంచాలని.. కచ్చితంగా సమయ వేళలు పాటించేలా చూడాలని ఆర్జేడీ ఎం.ఆదినారాయణ సూచించారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైమన్ విక్టర్, డీఐఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇక్కడ తెలుసుకున్న విషయాలను కళాశాలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకాంత్, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
● ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న తరగతులను మంగళవారం ఆర్జేడీ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష