
సింగిల్ బ్లండర్!
కంకిపాడు: సింగిల్ నంబర్ లాటరీ మోజులో జీవితాలు చిత్తవుతున్నాయి. అత్యాశతో కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. పచ్చ నేతల అండదండలతో అమ్మకందారులు ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా సింగిల్ నంబర్ లాటరీకి అడ్డాగా మారినా.. పోలీసు యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది.
చిన్నా పెద్దా తేడా లేదు..
ఎవరో ఒకరికి చిన్న లాటరీ తగిలిందన్న ప్రచారంతో ఎక్కువ మంది సొమ్ములకు ఆశ పడి సింగిల్ నంబర్ లాటరీ టికెట్లకు బానిసలవుతున్నారు. 15 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ ఈ టికెట్లను కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇళ్లల్లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి లాటరీ టికెట్లను కొనేవాళ్లు కొందరైతే, పగలంతా కష్టం చేసి ఆ కష్టాన్ని మరుసటి రోజు ఉదయాన్నే లాటరీ విక్రేతల వద్దకు వెళ్లి లాటరీ టికెట్లు కొనేవాళ్లు మరికొందరు. ప్రతి ఏరియాలోనూ వందల సంఖ్యలో వీటికి బానిసలయ్యారు. వీరి ఆశను సొమ్ము చేసుకుంటూ లాటరీ విక్రేతలు ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు.
అంతా బాహాటంగానే..
లాటరీ విక్రయాలు అంతా బాహాటంగానే సాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండు ప్రాంగణాలే వీరికి సింగిల్ నంబర్ విక్రయ కేంద్రాలుగా మారాయి. చైన్నె, విజయవాడ కేంద్రాల నుంచి వ్యాపారులు ఇక్కడి విక్రేతలకు లాటరీ టికెట్ల వివరాలను చెబుతారు. ఇందులో నల్లనేరం రూ. 150, స్వర్ణలక్ష్మి రూ. 800, విష్ణు రూ. 400, కుమరన్ రూ. 300, తంగం రూ. 80, సిక్కిం సూపర్ రూ. 80, లయన్ రూ. 1200 ఇలా అనేక రకాల కంపెనీలకు చెందిన లాటరీ టికెట్లు అమ్ముడవుతున్నాయి. వాటికి సంబంధించిన టికెట్లకు బదులుగా ఐదంకెల టికెట్ నంబరును పేపరుపైన, లేదా సిగిరెట్ డొక్కులపైనా రాసి కొనుగోలుదారులకు అప్పగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓ వెబ్‌సైట్ ద్వారా లాటరీ ఫలితాలు చూసుకోవాలని సూచిస్తారు. లాటరీ వచ్చేది అరుదు. అయినా ఆశతో ప్రతి రోజూ లాటరీ టికెట్ల కొనుగోళ్లు మాత్రం చేస్తున్నారు.
విక్రేతలకు భారీగా కమీషన్లు..
టికెట్ల విక్రయాల్లోనూ విక్రేతలకు భారీ మొత్తంలో కమీషన్లు అందుతాయని సమాచారం. ప్రధాన కేంద్రాల నుంచి లాటరీ టికెట్ల నంబర్లను స్థానిక విక్రేతలకు పంపుతారు. ఆ మొత్తాన్ని విక్రేతల ద్వారా అదే రోజు ఆన్‌లైన్‌లో పంపకాలు జరుగుతాయి. సుమారు 40 శాతం మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా లాటరీ తగిలితే కమీషన్ పేరుతో ప్రధాన విక్రేతలకు, స్థానిక విక్రేతలకు 60–65 శాతం పోనూ 35–40 శాతం మాత్రమే కొనుగోలుదారుడికి చేతికొస్తుంది.
ఫేక్ టికెట్లతో కాసుల పంట..
చోద్యం చూస్తున్న పోలీసులు..
సుమారు 15 ఏళ్ల క్రితం జిల్లాను ఈ సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు కుదిపేశాయి. అప్పట్లో పలువురు దీనికి బానిసలై అప్పులు చేయటంతో వాటిని తీర్చే పరిస్థితి లేక ఇళ్లు, స్థలాలు తాకట్టు పెట్టడం, ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డ ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మరోమారు ఈ వ్యాపారం జోరందుకుంది. అడ్డూ అదుపు లేకుండా వ్యాపారం సాగిపోతోంది. బహిరంగంగా టికెట్ల నంబర్లు చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం కిమ్మనటం లేదు. వ్యాపారులను నియంత్రించే చర్యలు తీసుకోవటం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాపారుల నుంచి పోలీసు శాఖకు భారీ మొత్తం నెలవారీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఆ వ్యాపారం జోలికి వెళ్లటం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
అత్యాశతో చిత్తవుతున్న జీవితాలు
జిల్లాలో జోరుగా సాగుతున్న
సింగిల్ నంబర్ లాటరీ విక్రయాలు
ఆశల వలలో చిక్కుకుని
బానిసవుతున్న వైనం
లూఠీ అవుతున్న పేదల కష్టార్జితం
చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం
మత్తు పదార్థాలకు బానిసలైనట్లు లాటరీ టికెట్లకు సైతం ఎంతో మంది బానిసలు అవుతున్నారు. ఇంట్లో బంగారం, డబ్బులు సైతం తెచ్చి టికెట్లను కొనుగోలు చేస్తున్నారంటే ఎంతగా ఈ వ్యాపారం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందో అర్థమవుతోంది. ప్రజల ఆశను వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాల నుంచి ఒక్కో వ్యాపారి రోజుకు రూ.లక్ష విలువైన టికెట్లను కొనుగోలు చేస్తే అమ్మకం మాత్రం రూ. 2 లక్షలకు పైగా అమ్ముతున్నారని వినికిడి. తద్వారా ఫేక్ నంబర్లను కాగితాలపై వేసి ఆ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.