ఒంటరి మహిళపై దౌర్జన్యం
టీడీపీ నాయకుల ఒత్తిడితో కేసు నమోదు చేయని పోలీసులు
రామవరప్పాడు: ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్న ఒంటరి మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన గురువారం ప్రసాదంపాడులో చోటు చేసుకుంది. ‘‘ నీ అంతు తేలుస్తా, నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా, నాకు టీడీపీ నాయకుల అండ ఉంది నిన్ను చంపితే దిక్కెవరు’’ అంటూ ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టయోటా షోరూమ్ పక్క వీధిలో కాల్వగట్టు ప్రాంతంలో బి.జయశ్రీ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఓ ఫొటో స్టూడియోలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుమారులను చదివిస్తోంది. ఇదే ప్రాంతంలో రోషిబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జయశ్రీ ఒంటరి మహిళ కావడంతో తరుచూ అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి రాత్రుళ్లు బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫూటుగా మద్యం తాగి జయశ్రీ ఇంటిపైకి వచ్చి దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. అతనితో పాటు రోషిబాబు కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కేసు నమోదు చేయడం లేదు
రోషిబాబు గత కొన్ని నెలలుగా నిత్యం మద్యం తాగి తన ఇంట్లోకి చొరబడి గొడవ పడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడంటూ పటమట సీఐ, ఎస్‌ఐలను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదని జయశ్రీ వాపోయింది. గతంలో కులం పేరుతో దూషిస్తూ బాణసంచా కాల్చి ఇంట్లో పడేసి బీభత్సం సృష్టించాడని తెలిపింది. స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించింది. రోషిబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం జరగకపోతే పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపింది.


