సకాలంలో సంతృప్తికర పరిష్కారమే లక్ష్యం
గుడివాడరూరల్: ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలసి ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ మనోహర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పంచాయతీ మంచినీటి చెరువులో ఎటువంటి ఆమోదం లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని గ్రామానికి చెందిన గంటా శ్రీను కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
● పట్టణంలోని 30వ వార్డు ధనియాలపేట కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, ఆ కాలనీ మహిళలతో కలసి కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
● గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన వనం విజయశాంతి, కె.స్వప్న తాము బీసీ కాలనీలో నివసిస్తున్నామని, ఇంటిపై విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. వీటి వల్ల కొన్నేళ్ల క్రితం ఇద్దరు టాపీ కార్మికులు చనిపోయారని వివరించారు. ఇది అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు.
అర్జీదారుల ఇబ్బందులు..
ఆర్డీవో కార్యాలయం వద్ద మీకోసం కార్యక్రమాన్ని ఉదయం 10.30గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారని ముందుగానే అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు 10.30గంటలకే రాగా.. కలెక్టర్ రెండున్నర గంటల పాటు ఆలస్యంగా రావడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత తాగడానికి నీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు అధికారులను ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు.
‘మీకోసం’లో కలెక్టర్ బాలాజీ


