బీచ్ ఉత్సవాలపై మంత్రి సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 15వతేదీ నుంచి 17వ తేదీ వరకు మూడురోజులపాటు జరుగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కలెక్టర్ డీకె బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ట్రైనీ కలెక్టర్ జాహెద్ ఫర్హీన్‌తో కలిసి బీచ్ ఉత్సవాల నిర్వహణపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయే ప్రాంతాల్లో ఫుడ్‌కోర్టులు, ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలో మ్యాప్ ద్వారా స్థలాల కేటాయింపుపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ క్రీడలైన కయాకింగ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రతిబింబించేలా బీచ్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. జలక్రీడలు, సాహసక్రీడలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు, పర్యాటకులకు కావాల్సిన వసతి, అతిథిగృహాలను సిద్ధం చేస్తున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మెప్మా పీడీ పి.సాయిబాబు, నాగాయలంక తహసీల్దార్ ఎం.హరినాఽథ్ పాల్గొన్నారు.


