మచిలీపట్నంఅర్బన్: క్షయవ్యాధి చాలా ప్రమాదకమైందని, కృష్ణా జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ఠ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సోమ వారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కుటుంబాల్లో ఎవరికైనా క్షయవ్యాధి ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. క్షయ నివారణకు డాట్స్ కేంద్రంలో ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లను సైతం అందచేస్తున్నమని పేర్కొన్నారు. రెండు వారాలు లేదా అంతకుమించి దగ్గుతో బాధపడుతూ ఉంటే వెంటనే, కళ్లి, కఫం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అయితే సమీప డాట్స్ కేంద్రంను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అంబటి వెంకట్రావు, డీఎన్‌ఎం వేణుగోపాల్ రావు, ఏఆర్టీ హెచ్‌ఎం వాసుదేవరావు, సీపీఎం ఎల్.మధుసూదనరావు, పలువురు ఏఎన్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ఠ


