నాగాయలంక: వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలప్పుడు తీసుకునే రక్షణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నాగాయలంక వద్ద కృష్ణాతీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, తదితర రెస్క్యూ టీమ్‌లు పాల్గొన్నాయి. విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పర్యవేక్షణలో 16శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌ను నిర్వహించారు. భవనం కూలిపొయి ప్రజలు దానిలో చిక్కుకున్నప్పుడు.. నదిలో వరదకు బోట్ బోల్తా పడినపుడు.. నది మధ్య లంకల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడం.. కృష్ణానదిలో చేపలవేట సమయంలో జాలరి పడిపోతే తోటి మత్స్యకారులు అతనిని ఎలా రక్షించాలి.. వంటి వాటిని డెమో చేసి చూపించారు. అలాగే లంకల్లో గర్భిణులు చిక్కుకుంటే బయటకు తీసుకురావడాన్ని ఐసీడీఎస్, మత్స్యశాఖ టీమ్ ప్రదర్శించింది.
ఆకట్టుకున్న స్టాల్..
విత్తుల వేళ అప్రమత్తంగా ఉండాల్సిన 16శాఖలు ప్రదర్శించిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఈ స్టాల్స్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. కృష్ణాజిల్లా ఐసీడీఎస్ పీడీ రాణి, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, బందరు ఆర్‌డీఓ కె.స్వాతి, నియోజకవర్గం ప్రత్యేక అధికారి పి.సాయిబాబు(మెప్మా పీడీ), స్థానిక తహసీల్దార్ ఎం.హరనాథ్ ఎంపీడీఓ జి.సధాప్రవీణ్, అవనిగడ్డ సీఐ యువకుమార్ మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించారు.
ఆపద వేళ రక్షణపై విపత్తుల సంస్థ మాక్‌డ్రిల్
విపత్తు ఏదైనా మేమున్నాం!


