అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్హులకు ఇబ్బంది లేకుండా ఆర్‌ఓఎఫ్‌ఆర్ (రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన అటవీ శాఖ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా అవసరమన్నారు. ఏవైనా ఆక్రమణలను గుర్తిస్తే అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కూడిన జాయింట్ తనిఖీల బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాస్థాయిలో అటవీ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. పచ్చదనం పెంచేలా వినూత్న కార్యాచరణతో అడుగులు వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ నీటి వనరుల గట్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గట్లు కూడా బలంగా ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎఫ్‌ఓ జి.సతీష్, ఎఫ్‌ఆర్‌ఓ కె.శ్రీనివాసులురెడ్డి, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలపైప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


