పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
మచిలీపట్నంటౌన్: హాయ్‌రా.. ఎలా ఉన్నావ్.. ఏం చేస్తున్నావ్.. నిన్ను చూసి చాలా కాలమయిందిరా.. చాలా మారిపోయావ్.. ఎంత మంది పిల్లాలు.. వారేం చేస్తున్నారు. నాడు తరగతిలో వీడు అలా చేశాడు.. ఇలా చేశాడు అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. గత మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుని ఆనందంగా గడిపారు నగరంలోని శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు. ఆ స్కూల్లో 1983 నుంచి 2023 వరకూ చదువుకున్న 40 బ్యాచ్‌లకు చెందిన దాదాపు రెండు వేల మంది విద్యార్థులు వారి కుటుంబాలతో నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఆదివారం కలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి మంచి హోదాల్లో పని చేస్తున్న వీరంతా చిన్న నాటి స్నేహితులతో ఆనందంగా గడిపారు. అందరూ కలసి ముందుగానే సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రాణ స్నేహితులతో కలసి ఈ ఏడాది సంక్రాంతి జరుపుకోవటం తమ జీవితంలో మర్చిపోలేమని పేర్కొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు, గాలిపటాలు ఎగురవేసి ఆనందంగా గడిపారు. ప్రస్తుతం స్కూల్లో చదువుతున్న చిన్నారులు పలు సినీ గీతాలకు చేసిన నృత్యాలతో పూర్వ విద్యార్థులు కేరింతలు కొట్టారు. తమ స్నేహితులతో కలసి మాట్లాడుతూ భోజనాలు చేశారు. తోటి విద్యార్థులతో గ్రూప్, సెల్ఫీ ఫొటోలు దిగారు. స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ చిత్తజల్లు రామకృష్ణ దంపతులను కోలాట భజనలు చేస్తూ, పువ్వులు చల్లుతూ వేదిపైకి తీసుకొచ్చి మరీ బ్యాచ్‌ల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. కొంత మంది విద్యార్థులు రామకృష్ణ మాస్టార్ కాళ్లకు నమస్కరించటం, పాదాలను కడగటం చేశారు. స్కూల్లో ఇప్పటి వరకూ పని చేసిన ఉపాధ్యాయులను రామకృష్ణ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం నిర్వహణ డైరెక్టర్ జంపన శ్రీకాంత్, కార్యదర్శి షేక్ మహమ్మద్‌సాహెబ్‌లను పూర్వ విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా హాజరై అభినందించారు.
మధుర స్మృతులను పంచుకుని
చెమర్చిన నయనాలు
పాల్గొన్న 40 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు
రెండు వేల మంది హాజరు
స్నేహితులతో కలసి భోజనాలు
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక


