ఫలితాలు వెల్‌... ప్రవేశాలు ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు వెల్‌... ప్రవేశాలు ఫుల్‌

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు ఆదరణ ● విద్యార్థులకు మెరుగైన బోధన, వసతులు ● ప్రథమ సంవత్సరంలో 2,885 ప్రవేశాలు

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల సంఖ్య గతం కంటే గణనీయంగా పెరిగింది. ప్రవేశ గడువు అక్టోబర్‌ 29కి ముగియగా జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2,885 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తుండడంతో వీటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్‌లు ఇస్తుండడం, డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తుండడం, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. మొదటి విడత జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల గడువు జూలై 15వరకు ముగిసింది. మూడుసార్లు గడువు పొడిగించడంతో గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు వచ్చాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, రెబ్బెన, సిర్పూర్‌(టి), జైనూర్‌ తదితర మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యధికంగా కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 530 మంది, దహెగాంలో 77మంది ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు.

పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు మార్చి 2027లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడు వు తేదీలను విడుదల చేసింది. అక్టోబర్‌ 26నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 11నుంచి 20నవంబర్‌ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్‌ 22నుంచి 29వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో డిసెంబర్‌ 1నుంచి 7వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 9నుంచి 14వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని బోర్డు కల్పించింది. ఇక ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు ఉండదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. 2016నుంచి అమలు చేస్తున్నట్లే ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్ష ఫీజు టీజీబీఐఈ ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది.

గతేడాది కంటే మెరుగు

జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గతేడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. కళాశాలల్లో మెరుగైన విద్యాబోధన అందించడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. అడ్మిషన్లు పెరిగేందుకు ఇదే కారణం. సిర్పూర్‌(టి), కౌటాల, కాగజ్‌నగర్‌లో గతేడాది కంటే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు పొందారు. విద్యార్థులు నవంబర్‌ 9వరకు అపరాధ రుసుము లేకుండా ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి.

– కల్యాణి, డీఐఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement