నాణ్యత.. | - | Sakshi
Sakshi News home page

నాణ్యత..

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

● నాణ్యత లేని ఇసుక, ఇటుకలు, సిమెంట్‌ మిశ్రమాలతో పనులు ● కొన్నిరోజులకే దెబ్బతింటున్న స్లాబులు, గోడలు ● ఆందోళనలో కొలాం గిరిజనులు

కాంట్రాక్టరుకెరుక!

నాసిరకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వైనం

ఈ ఫొటోలోని కొలాం గిరిజన మహిళ పేరు కుంరం అయ్యుబాయి. వాంకిడి మండలం వెల్గీ పంచాయతీలోని మన్నెగూడ(ఖేడేగాం) గ్రామానికి చెందిన ఈమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. సదరు కాంట్రాక్టర్‌ పునాదుల నుంచే అడ్డదిడ్డంగా పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల స్లాబ్‌ పనులు పూర్తికాగా వర్షాలకు ఉరుస్తోంది. గోడలన్నీ తడిసిపోతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. భారీ వర్షాలకు స్లాబు నుంచి నీటిధారలు పడుతున్నాయని చెబుతోంది.

ఈ ఇందిరమ్మ ఇల్లు రింగారేట్‌ గ్రామంలోనిది. ఇక్కడా కాంట్రాక్టరే పనులు చేపట్టాడు. గ్రామంలోని అన్నీ ఇళ్లు ఇలాగే నాసిరకంగా కనిపిస్తున్నాయి. పిల్లర్ల మధ్యలో ఇటుకలు పెట్టడం, వంకరగా నిర్మించడం వంటి నిర్లక్ష్యం వెలుగు చూసింది. మరో విషయం ఏంటంటే ఇంటికి పూర్తిస్థాయిలో పిల్లర్లు కావాలనుకుంటే ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతోపాటు అదనంగా మరో రూ.60 వేలు, అలాగే సజ్జలకు అదనంగా మరో రూ.30 వేలు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అదనంగా వసూలు చేసినా పనుల్లో ఏమాత్రం నాణ్యత కనిపించక పోవడం గమనార్హం.

వాంకిడి: సొంతింటి కల ప్రతిఒక్కరికి ఎంతో ప్రత్యేకమైంది. జిల్లాలోని నిరుపేదలైన గిరిజన ప్రజలకు స్లాబుతో కూడిన పక్కా ఇళ్లు మంజూరు కావడంతో సంతోషపడ్డారు. పీవీటీజీ లబ్ధిదారులు సొంతంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితులు ఉండటంతో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కానీ సదరు కాంట్రాక్టర్లు పునాదుల నుంచే నాసిరకం పనులు చేపడుతున్నారు. నాసిరకం ఇసుక, ఇటుకలు, సిమెంట్‌ వాడుతూ అందినకాడికి ఖర్చులను మిగిల్చుకుంటున్నారు. ఫలితంగా కట్టడాలు పూర్తికాకుండా నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి.

తక్కువ నిధులతోనే నిర్మాణం

జిల్లాకు మొత్తం 8,798 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారు. ఇందులో 4,734 ఇళ్లను గిరిజనులకు కేటాయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పీవీటీజీలకు కేటాయించిన గృహాలను చాలావరకు కాంట్రాక్టర్లే నిర్మిస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.5 లక్షలతోపాటు వారు ఇంటి పిల్లర్లు, సజ్జలు, విద్యుత్‌ వైరింగ్‌ కోసం పైపులు కోసం లబ్ధిదారుల నుంచే అదనంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇప్పటికే స్లాబ్‌ దశ వరకు నిర్మించిన ఇళ్లకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకే వెచ్చించినట్లు తెలుస్తోంది. నాణ్యత లేక కొన్నిరోజులకే స్లాబులు ఉరుస్తున్నాయి. గోడలు, పిల్లర్లు వంకరగా ఉండగా స్లాబు బిల్ల సైతం అదే మాదిరి వేశారు. రాడ్లు బయట కనిపిస్తున్నాయి. స్లాబుకు తక్కువ నాణ్యత కలిగిన రాడ్లు, 25 నుంచి 30 సిమెంట్‌ బస్తాలు మాత్రమే వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని నార్నూర్‌ మండలం లొద్దిగూడ(కొలాంగూడ)లో స్లాబు వేసిన కొన్ని రోజులకే కూలిపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు పనులు పర్యవేక్షించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

బేస్‌మెంట్‌కే పరిమితం

వాంకిడి మండలం పాటగూడకు చెందిన సోంబాయికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణ పనులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్లాబ్‌ వరకు పనులు పూర్తి కాగా వర్షాలకు నీరు ఉరుస్తోంది. తేమ, వర్షపు నీటిని గమనించి లబ్ధిదారు ఆందోళనకు గురయ్యారు. పలువురు నాయకులు సైతం వెళ్లి పరిశీలించారు.

చర్యలు తీసుకుంటాం

నాసిరకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే చర్యలు తీసుకుంటాం. ఇంటి నిర్మాణ సమయంలో ఏఈ, డీఈలు పర్యవేక్షిస్తున్నారు. నాణ్యత పాటించనట్లు మా దృష్టికి వస్తే వాటి బిల్లులు నిలిపివేస్తున్నాం.

– ప్రకాశ్‌, హౌజింగ్‌ పీడీ

బెజ్జూర్‌: బెజ్జూర్‌ మండలానికి తొలివిడతలో 515 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్లు నాణ్యతతో పనులు చేపట్టడం లేదనే ఆ రోపణలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కాంట్రా క్టర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని బేస్‌ మెంట్‌ లెవల్‌ వరకు నిర్మించిన వదిలేశారు. ఈ విషయంపై ఏఈ సాయికుమార్‌ను వివరణ కో రగా.. నాణ్యత లేకుండా నిర్మాణం చేపడితే బిల్లులు నిలిపివేస్తామని, ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు.

గిరిజనులను దోచుకోవడం సరికాదు

అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న కొలాం గిరి జనులైన పీవీటీజీలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపడుతున్నారు. కొలాం గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవడం సరికాదు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

– సిడాం అన్నిగా, కొలాం సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement