ఆసిఫాబాద్: తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ వెన్నెముకగా నిలిచారని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హరి త అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఏ ఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, ప్రజా సేవకు అంకితమైన ఆయన జీవితం చిరస్మరణీయమన్నారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసిన త్యాగమూర్తి అని కొనియాడారు. బాపూజీ ఆశయాలు, సేవా స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్, సీపీవో గురువయ్య, డీఏవో వెంకట్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.


