పూజలు, మంత్రాల పేరుతో గ్రామాల్లో నకిలీ బాబాల మోసాలు కౌటాలలో డబ్బుల వర్షం కురిపిస్తామని వ్యాపారులకు టోకరా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
ఆగస్టు 28న కౌటాల మండలం వీర్దండికి చెందిన ఒక వ్యక్తి కుమారుడు అనారోగ్యానికి గురికాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన కోవె గణపతి అనే పూజారి పూజలు చేశారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మంత్రాలు చేయడంతోనే మీ కుమారుడికి రోగం వచ్చిందని నమ్మించి, అతడి ఇంటికి వెళ్లి బెదిరించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పూజారిపై ఎస్సై సతీశ్ కేసు నమోదు చేశారు.
కౌటాలలో ఇద్దరు వ్యాపారులను మహారాష్ట్రకు చెందిన మోసగాళ్లు మంత్రాలు, పూజలతో డబ్బుల వర్షం కురిపిస్తామని, బంగారం రెట్టింపు చేస్తామని ఆశపెట్టారు. ఈ వ్యవహారంలో మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దళారులుగా వ్యవహరించడం గమనార్హం. రాత్రిపూట వ్యాపారుల నగదు, బంగారంతో ఒక ఇంటి వద్ద పూజలు చేసి మత్తుమందును ప్రయోగించారు. వారు స్పృహ కోల్పోయిన అనంతరం బంగారం, నగదు దోచుకుని పారిపోయారు. మత్తుమందుతో బాధితులు ప్రాణాపాయ స్థితికి చేరుకోగా ఆసుపత్రి పాలయ్యారు.
చింతలమానెపల్లి: ఓ వైపు సాంకేతిక విప్లవం పరుగులు తీస్తుండగా, మరోవైపు మూఢ నమ్మకాలు, మంత్రాల పేరిట మోసాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అమాయకత్వం, అత్యాశ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన, అనారోగ్య భయాలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నకిలీ బాబాల అవతారమెత్తుతున్నారు. జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలన్నీ గ్రామీణ మండలాలు. కొంతకాలంగా జరిగిన ఘటనలు చాలావరకు ఈ ప్రాంతాల్లోనే వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండే మండలాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం కొంత ఎక్కువే. ప్రజల ఆర్థిక అవసరాలు, తీవ్ర అనారో గ్య పరిస్థితులు మూఢ నమ్మకాలను పెంచుతున్నాయి. గుప్తనిధుల తవ్వకాలు, నరబలి ఘటనలు సైతం గతంలో చోటుచేసుకున్నాయి. మంత్రాల నెపంతో హత్యలకు సైతం పాల్పడ్డారు.
రోగాలు నయం కావు
మంత్రాలతో రోగం, వ్యాధి తగ్గుతుందనే దానికి శాసీ్త్రయ నిరూపణ లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికిత్స తీసుకోకుండా జాప్యం చేస్తే ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా సంకో చం లేకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలు, వై ద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఫిర్యాదులకు వెనుకాడొద్దు..
మంత్రాలు, మూఢనమ్మకాలు, మద్యం, శాంతిభద్రతలు తదితర అంశాలపై పోలీసు శాఖ కళాజాత బృందాలతో చేయిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఎస్సై స్థాయి నుంచి సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ సైతం అవగాహన కల్పిస్తున్నారు. మంత్రాలు, పూజల పేరిట మభ్యపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఫిర్యాదుకు వెనుకాడొద్దుని పోలీసులు సూచిస్తున్నారు.
‘మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి.. డబ్బుల వర్షం కురిపిస్తాం.. పరిష్కారం కాని అనారో గ్యాన్ని తగ్గిస్తాం.. మీపై మంత్రాలు చేశారు.. చేతబడి చేశారు..’ ఇవీ మంత్రాల కేటుగాళ్లు చెప్తున్న మాటలు. విరుగుడు పేరిట వేలాది రూపాయాలు వసూలు చేయడం, గ్రామాల్లో చిచ్చు పెట్టి వివాదాలు సృష్టించడం వీరిపని. పూజల పేరిట ఇంటికి వచ్చి ప్రసాదం, మత్తుమందులు చల్లి బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత అందిన కాడికి దోచుకుని పారిపోతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిందితులు ఎక్కువగా మహారాష్ట్రకు పారిపోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితులు మోసాన్ని బయటకు చెప్పేందుకు సంకోచిస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే ఆలోచనతో పోలీసులనూ ఆశ్రయించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు.


