ఇక్కడ పత్తి చేనులో పూతకాత చూపుతున్న రైతు వెన్నంపల్లి పెంటయ్య. ఈ వానాకాలం సీజన్‌లో పదెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. వర్షాలు అనుకూలంగా పడటంతో పూతకాతతో పంట ఆశాజనకంగా ఉంది. ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. గతేడాది కాత దశలో అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. ఈసారి మార్కెట్‌లో అధిక ధర ఉంటే లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నామని పేర్కొంటున్నాడు.
దహెగాం మండలం దేవులగూడ గ్రామానికి చెందిన దరవాత్ దేశు ఈసారి 30 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. ఆకు ముడ త, ఇతర తెగుళ్లు సోకుతుండటంతో నివారణకు మందులు పిచికారీ చేస్తున్నాడు. చెట్టుకు ప్రస్తుతం 10 నుంచి 15 కాయలు ఉన్నాయి. దిగుబడి బాగుంటుందని ఆశిస్తున్నాడు..
దహెగాం: వానాకాలంలో పత్తి సాగు చేసిన రైతులు దిగుబడి, గిట్టుబాటు ధరపై ఆశలు పెంచుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యమైనా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మొక్కలు ఏపుగా పెరిగి పూతకాత దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆగస్టులో కురిసిన వర్షాలతోపాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నేలలో తేమతో కాయలు పెరిగే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4,52 లక్షల ఎకరాలు ఉండగా అందులో ప్రధానంగా పత్తి పంట 3.77 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. గతేడాది పత్తి 3.35 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈ ఏడాది ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఉంటా యని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అవగాహన కల్పించారు. చాలా మంది తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మొ గ్గు చూపి వరి తగ్గించి పత్తికి ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో వరి 20వేల ఎకరాల వరకు తగ్గగా, పత్తి సుమారుగా 42వేల ఎకరాల వరకు పెరిగింది. అలాగే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, సోయాబీన్, పెసర, మినుములు, మిర్చి సాగు విస్తీర్ణం కూడా పెరగడం గమనార్హం.
సాధారణ వర్షపాతమే..
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా వేసినా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు సైతం పెరిగా యి. అయితే గతేడాది అధిక వర్షపాతం నమోదు కాగా, ఈసారి సాధారణ వర్షపాతానికే పరిమితం కావాల్సి వచ్చింది. 2025లో జిల్లాలో 1019.2 మిలీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 1248.5 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1019.2 మిల్లీమీటర్లకు 1014.5 మిల్లీమీటర్లు కురిసింది. కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో మాత్రమే లోటు ఉంది. అ త్యధికంగా కౌటాలలో –22.0శాతం, చింతలమానెపల్లిలో –21.0శాతం, సిర్పూర్(టి) మండలంలో –17శాతం తక్కువ వర్షం కురవగా, కెరమెరి మండలంలో మాత్రం 28.0 శాతం ఎక్కువగా కురిసింది.
తెగుళ్లను అధిగమిస్తేనే..
పూత కాత దశలో ఉన్న పత్తి పంటను ప్రస్తుత వాతావరణలో మార్పులతో ఆకుముడత, దోమ బెడద వేధిస్తోంది. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నేలలో పోషకాలను గ్రహించకపోవడంతో వడలిపోతున్నాయి. నివారణకు 2 శాతం యూరియా లేదా 1 శాతం పోటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. పత్తిలో దోమ, తామర పురుగులు ఉధృతి కూడా ఉంటుంది. 2 మి.లీ. ప్రిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థ యురాన్ లేదా 0.3 గ్రాములు ప్లొనికామిడ్ లేదా 0.75 గ్రాముల సల్పాక్సాప్లోర్ మందును 5 మి. లీ. 1500 పీపీఎం వేప నూనెతో పాటు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు. గులాబీ పురుగు నివారణకు చేనులో లింగార్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. నివారణకు 2 మి.లీ. ప్రొఫెనోపాస్ మందును 5 మి.లీ. వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలి.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం
(శాతం)
జైనూర్ 1069.2 1180.2 +10.0
సిర్పూర్(యు) 1063.2 1077.6 +1.0
లింగాపూర్ 1010.7 1151.9 +14.0
తిర్యాణి 896.7 1012.6 +13.0
రెబ్బెన 879.2 927.4 +5.0
ఆసిఫాబాద్ 913.2 952.3 +4.0
కెరమెరి 910.1 1161.4 +28.0
వాంకిడి 963.9 922.1 –4.0
కాగజ్‌నగర్ 936.0 874.9 –7.0
సిర్పూర్(టి) 1065.8 889.9 –17.0
కౌటాల 1106.4 859.8 –22.0
చింతలమానెపల్లి 1113.5 880.3 –21.0
బెజ్జూర్ 1177.0 1185.9 +1.0
పెంచికల్‌పేట్ 1087.1 1150.3 +6.0
దహెగాం 1096.2 990.6 –10.0


