చింతలమానెపల్లి: పచ్చని అడవులు, జలపాతాలు, నదులతో ప్రకృతి రమణీయతకు నిలయమైన జిల్లాలోని జలవనరులకు మహర్దశ పట్టనుంది. సహజసిద్ధమైన నీటి వనరులు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ఏడు చెరువులను చిత్తడినేలల కింద ఎంపిక చేసింది. ఆయా చెరువుల అభివృద్ధి, పర్యావరణ, ప్రకృతి సమతుల్యత ఆధారంగా పనులు నిర్వహించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రతిపాదనలు సిద్ధం..
జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు, వట్టివాగు తదితర జీవనదులు ఉన్నాయి. నదులు, వాగులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో వేసవిలోనూ సమృద్ధిగా నీరు నిల్వ ఉంటోంది. ఈక్రమంలోనే చిత్తడి నేలలుగా అభివృద్ధి చేయడానికి అనువుగా ఉన్న ఏడు చెరువులను ప్రభుత్వం ఎంపిక చేసింది. చిత్తడి నేలలుగా ఎంపిౖకైన కాగజ్‌నగర్ మండలం కోర్సిని చెరువు, తిర్యాణి మండలం ఎన్‌టీఆర్ సాగర్ ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ చెరువు(33 హెక్టార్లు), పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ చెరువు(93 హెక్టార్లు)లో పనులకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వాంకిడి మండలంలోని నార్లాపూర్, రాంజీ చెరువు, నవేఝరి చెరువు పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల సమస్వయంతో చిత్తడి నేలలకు సంబంధించిన అనుమతులను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా శాఖల నుంచి ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రాలు) సేకరిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ చెరువును ప్రభుత్వం చిత్తడి నేలల కింద ఎంపిక చేసింది. 33 హెక్టార్ల చెరువు స్థలంలో అభివృద్ధి కోసం రూ.2.6 కోట్ల నిధులతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించాం. అన్ని శాఖల అనుమతులను ఇప్పటికే తీసుకున్నాం. పనులు పూర్తయితే పర్యావరణ పరంగా ఎంతో మేలు కలుగుతుంది.
– సుభాష్, ఎఫ్‌ఆర్‌వో, ఖర్జెల్లి
అర్కగూడ చెరువు
చిత్తడి నేలల ప్రాముఖ్యత
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చిత్తడి నేలలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని భూమికి జీవం పోసే అవయవాలుగా భావిస్తారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే కాకుండా వరద ఉధృతిని తగ్గించడంలోనూ దోహదపడతాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న చిత్తడి నేలలు దేశ, విదేశీ పక్షులను ఆకర్షిస్తున్నాయి. జలాచరాలకు ఆవాసాలుగా ఉన్నాయి.
ఎంపిక చేసిన చెరువులు
మండలం చెరువు
చింతలమానెపల్లి అర్కగూడ
పెంచికల్‌పేట్ ఎల్లూర్
కాగజ్‌నగర్ కోర్సిని
తిర్యాణి ఎన్‌టీఆర్ సాగర్
వాంకిడి నార్లాపూర్
వాంకిడి రాంజీ చెరువు
వాంకిడి నవేఝరి(గుండాల)
చేపట్టే అభివృద్ధి పనులు
చెరువుల్లో పూడిక పేరుకుపోవడం, ఆక్రమణలు, నిర్వహణ లేకపోవడంతో చిత్తడి నేలలు రూపు కోల్పోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎంపిక చేసిన చెరువుల వద్ద పలు అభివృద్ధి పనులు చేపట్టనుంది. ప్రధానంగా చెరువుల అభివృద్ధి, పర్యావరణ, ప్రకృతి సమతుల్యత ఆధారంగా పనులు నిర్వహిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.
చెరువుల్లో పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కట్టలను బలోపేతం చేయడం ద్వారా కోతను నివారించనున్నారు.
శాసీ్త్రయ పద్ధతుల్లో నాణ్యమైన చేప పిల్ల లను వదలనున్నారు. చేప పిల్లల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారులు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా ఆదాయాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు.
పక్షుల ఆవాసాలు, ఆహార లభ్యతను పెంచేందుకు మొక్కలను విస్తృతంగా నాటుతారు. పెంపకం, సంరక్షణకు నిధులను వినియోగిస్తారు.
సందర్శకులు, అధికారుల పర్యవేక్షణకు వాచ్‌టవర్లను నిర్మిస్తారు. పచ్చదనం కోసం స్థానిక జాతుల మొక్కలను పెంచడం, పక్షులను ఆకర్షించేందుకు చెరువుల మధ్యలో మట్టి దిబ్బలను ఏర్పాటు చేస్తారు.


