కాగజ్‌నగర్‌టౌన్: డిగ్రీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం గురు, శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చివరి అవకాశంగా ప్రవేశాలు పొందేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధికారులు సూ చిస్తున్నారు. జిల్లాలో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వాంకిడి డిగ్రీ కళాశాల, ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ మహిళా కళాశాలలతోపాటు ఆరు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 397 ఖాళీ సీట్లు ఉన్నాయి. కానీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు ఏయే గ్రూప్‌ల్లో ఎన్ని అడ్మిషన్లు జరిగాయి.. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే విషయంపై ప్రిన్సిపాళ్ల వద్ద సరైన సమాచారం లేదు.
ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీలు ఇలా..
కాగజ్‌నగర్, వాంకిడిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతోపాటు ఆసిఫాబాద్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ మహిళా కళాశాలలో 1200 సీట్లకు 803 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మరో 397 సీట్లు వివిధ గ్రూప్‌లలో ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందాలని అధికారులు కోరుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఇంకా దోస్త్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్ పొందని విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. స్పాట్ అడ్మిషన్ ద్వారా గురువారం నుంచి కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి దరఖాస్తు చేసుకుని అడ్మిషన్ పొందాలి. అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీదేవి,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కాగజ్‌నగర్


