కౌటాల: జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్నిప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా ఇంకా కొన్ని మండలాల్లో లోటు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఇంకా వర్షపాతం సరి పడా లేకపోవడంతో పంటలకు సకాలంలో నీటి త డులు అందడం లేదు. ముఖ్యంగా మిర్చి రైతులను విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. బోర్లు, బావుల కింద వేసిన పంటలకు సైతం సక్రమంగా నీటి తడులు అందడం లేదు. త్రీఫేస్ విద్యుత్ సరఫరాలో అప్రకటిత కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల 20 గంటలు నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఎమ్మెల్సీ విఠల్‌కు రైతులు వినతిపత్రం అందించారు.
రెండు మండలాల్లో లోటు
గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లావ్యాప్తంగా మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. గతేడాది 1,900 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి దాదాపు 3,200 ఎకరాల్లో సాగు చేశారు. వరి పంటను కేవలం 34,452 ఎకరాల్లోనే పరిమితం చేశారు. గతేడాది వరి 54 వేల ఎకరాల్లో సాగు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పంట పత్తి 3,77,764 ఎకరాల్లో సాగవుతోంది. జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 1009.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 23వ తేదీ వరకు 964.1 మిల్లీమీటర్లు కురిసింది. – 5 శాతం వ్యత్యాసం ఉంది. కౌటాల మండలంలో 24శాతం, చింతలమానెపల్లి మండలంలో 24శాతం లోటు నమోదైంది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతమే ఉన్నా.. కెరమెరిలో 18శాతం, సిర్పూర్(టి)లో 18, బెజ్జూర్‌లో 12 శాతం తక్కువ వర్షం కురిసింది. జిల్లాలో కౌటాల మండలంలో ఎక్కువగా మిర్చి సాగువుండగా, ఇక్కడే లోటు వర్షపాతం ఉంది. మరోవైపు విద్యుత్ కోతలతో రైతులు పంట చేలకు నీటి తడులు అందించలేకపోతున్నారు. ఫలితంగా బోర్లు, బావులు ఉన్నా మిర్చి మొక్కలు ఎదగడం లేదు. దిగుబడిపై ప్రభావం పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌటాల మండలం తాటిపల్లిలో నెర్రలు బారిన మిర్చి తోట


