జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులుగా పూజలందుకున్న లంబోదరుడికి ఉదయమే భక్తులు పూజలు చేసిన అనంతరం సన్నాయి వాయిద్యాలు, బ్యాండ్ మేళాతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని గణేశ్ మందిర్, శిశుమందిర్, వాసవీ విద్యామందిర్‌తోపాటు పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను పెద్దవాగులో నిమజ్జనం చేశారు. వివేకానంద చౌక్, గాంధీ చౌక్, పొటిశ్రీరాములు చౌక్ శివకేశవ మందిర్ మీదుగా శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. మహిళలు, యువతుల కోలాటం, దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి వరకు వినాయక నిమజ్జనం కొనసాగింది. అయితే జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో నిర్వాహకులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, నాయకులు పాల్గొన్నారు. – ఆసిఫాబాద్


