అంబరాన్నంటిన
జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరై సంప్రదాయబద్ధంగా జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది తెగల అమరుల చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం కుమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శనీయమని, వాటిని భావితరాలకు అందించాలన్నారు. జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సదుపాయం, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలతో చర్చించి గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆదివాసీల సంస్కృతి, జీవనశైలి, ఆచారాలు, అలవాట్లు విభిన్నమైనవని అన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి స్మారక స్థూపం అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేశారని తెలిపారు. పోడు సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఐటీడీఏను బలోపేతం చేయాలి
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ఐటీడీఏ ఉత్సవ విగ్రహంలా తయారైందని, ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్, జుగా పథకాల ద్వారా గిరిజనులు, పీవీటీజీలకు గృహాలు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. 5వ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వాలు బడ్జెట్‌లో గిరిజనుల అభివృద్ధికి 5 శాతం నిధులు కేటాయించాలన్నారు.
కార్యక్రమం సాగిందిలా..
అంతకు ముందు రాయిసెంటర్ వద్ద గిరిజన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి ర్యాలీగా బయలుదేరి గాంధీచౌక్ వద్ద అంకమరాజు ఆలయంలో పూజలు చేశారు. కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదివాసీ భవన్‌లో పోరాట యోధులకు నివాళుల ర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ గీతాలాపన చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్, ఎస్పీ, డీసీసీ అధ్యక్షురాలు చేసిన పర్ధాన్ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. క్రీడాపాఠశాలల, గిరిజన గురుకుల పాఠశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థినులతోపాటు ఆదివాసీలు నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో బాలామణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎంహెచ్‌వో నాగేంద్ర, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, పుర్క మాణిక్‌రావు, సిడాం అర్జు మాస్టర్, మర్సుకోల సరస్వతి, పెందూర్ గోపి, గుణవంత్‌రావు, మోతీరాం, ఆత్రం భీంరావు, సిడాం శంకర్, ఎల్లయ్య, బుర్స పోచయ్య, సుధాకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
వసతుల కల్పనకు కృషి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అటవీ అధికారులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


