‘సర్దుబాటు’ కొలిక్కి..! | - | Sakshi
Sakshi News home page

‘సర్దుబాటు’ కొలిక్కి..!

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

జిల్లాలో 96 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేటాయింపు ఈ నెల 11 నుంచి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఆదేశాలు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 2026– 27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పూర్తికావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పించారు. మంగళవారం నుంచి కేటాయించిన పాఠశాలల్లో టీచర్లు బోధన చేయాల్సి ఉంటుంది. జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో 728 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 42,358 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలల్లో అదనంగా ఉన్న వారిని సమీపంలోని బడులకు డిప్యూటేషన్‌ ద్వారా సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అడ్మిషన్లు పూర్తికాకపోవడంతో ఖాళీల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో సర్దుబాటు ప్రక్రియ ఆగస్టు వరకు వచ్చింది.

728 స్కూళ్లు.. 397 ఖాళీలు

జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 728 ఉన్నాయి ఆయా స్కూళ్లలో స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2,050 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 397 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. 2024లో జీవో 317 ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 65 మంది స్పౌజ్‌(భార్యాభర్తలు) కేసుల్లో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. 1 నుంచి 10 మంది మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది ఉంటే ఆరుగురు ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాలల్లో 200 ఉంటే స బ్జెక్టు ఒక్క ఉపాధ్యాయులు, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంటుంది.

విద్యార్థులు నష్టపోకుండా చర్యలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా 96 మంది టీచర్లను సర్దుబాటు చేశాం. ఈ నెల 11 నుంచి ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరాలి.

– సచ్చిదానంద చారి, డీఈవో

జిల్లాలో సర్దుబాటు ఇలా..

మండలం ఉపాధ్యాయులు

ఆసిఫాబాద్‌ 19

దహెగాం 14

బెజ్జూర్‌ 1

జైనూర్‌ 5

చింతలమానెపల్లి 1

కాగజ్‌నగర్‌ 3

కెరమెరి 10

కౌటాల 5

లింగాపూర్‌ 2

రెబ్బెన 6

సిర్పూర్‌(టి) 5

సిర్పూర్‌(యు) 1

తిర్యాణి 5

వాంకిడి 13

96 పాఠశాలలకు టీచర్లు

జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 96 పాఠశాలలో 96 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. 80 మంది స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు, 16 మంది స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. 2024లో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 2025లో 80 పాఠశాలలో 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో 58 మంది ఎస్జీటీలు, 34 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తు తం 96 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్‌ మండలంలో 19 మంది, దహెగాంలో 14 మంది, వాంకిడి 13 మంది, కెరమెరి పది మందిని సర్దుబాటు చేయగా, బెజ్జూర్‌, చింతలమానెపల్లి, సిర్పూర్‌(యు) మండలాల్లో కేవలం ఒక్కొక్కరిని సర్దుబాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement