కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామస్తులు పో డుసాగుపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. ఉడుంపూర్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పంటల సాగులో నిబంధనలు ఎత్తివేయాలని నాలుగు గంటల పాటు కడెం–జన్నారం–ఉట్నూర్ ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టి బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌డీవో శివకుమార్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. పోడుసాగులో ట్రాక్టర్లు, మిషన్లను ఉపయోగించరాదని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ నిబంధన మేరకు ఎడ్ల నాగలితో సాగు చేపట్టవచ్చని తెలిపారు. సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్, పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్లుగా చేస్తున్న భూముల సాగులో ఇప్పుడు నిబంధనల పేరిట ట్రాక్టర్లు, మిషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు. తమ వ్యవసాయాన్ని అడ్డుకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎఫ్‌ఆర్వో గంటల శ్రీనివాస్‌రెడ్డి వారికి చెప్పడంతో ఆందోళన విరమించారు. నాలుగు గంటల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
రాళ్లు విసిరి దాడి చేశారు
ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోఎఫ్‌ఆర్ భూముల్లో ట్రాక్టర్‌తో దున్నడం నేరమని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఆపాం. పలువురు గ్రామస్తులు కార్యాలయంపై రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.50 వేల ఆస్తినష్టం వాటిల్లింది. నాతో పాటు, సిబ్బందికి ప్రాణహాని ఉంది.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వో, ఉడుంపూర్


