కౌటాల: సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో జీతాలు.. అయినా.. ఇది సరిపోదన్నట్లుగా కొందరు జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలో చాలామంది అధికారులు వాహన వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు అద్దె కార్లు వినియోగించవచ్చు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధి కారులు, తహసీల్దార్, ఎంపీడీవోలకూ ఈ సదుపా యం ఉంది. కానీ, నెలనెలా అందించే వాహనాల అద్దె కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్ర భుత్వ అధికారులు ట్యాక్సీ రిజిస్ట్రేషన్ (పసుపు రంగు నంబర్ ప్లేట్) ఉన్న వాహనాలు వినియోగించా లి. ఈ వాహనానికి బీమా కోసం ఏటా రూ.30వేల వరకు, ఫిట్‌నెస్ కోసం రూ.1,500 రవాణా శాఖకు చెల్లించాలి. సొంత వాహనం (తెల్ల నంబర్ ప్లేట్ ఉన్న వాహనం) రూ.3వేల వరకే బీమా చెల్లించాల్సి ఉంది. ఫిట్‌నెస్ చార్జీలుండవు. జిల్లాలోని అనేక మంది అధికారులు సొంత వాహనాలనే వాడటంతో రవాణాశాఖ ఆదాయానికి గండిపడుతోంది.
అద్దె కోసం అడ్డదారులు
జిల్లాలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో అద్దెకార్ల తంతు నడుస్తోంది. ట్యాక్సీ రిజిస్ట్రేషన్లున్న కార్ల నంబర్లు, ఆయా యజమానుల వివరాలు అధికారులు తెచ్చుకుంటున్నారు. వీరి వాహనాలనే వినియోగించుకుంటున్నామని బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అనేక చోట్ల అధికారులే సొంతంగా వాహనాలు నడుపుకొంటూ డ్రైవర్‌కు ఇచ్చే వేతనం కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తమకు తెలిసిన వారివి లేదా రూ.5వేలు, రూ.10 వేలు కమీషన్లు ఇస్తూ ఎల్లోప్లేట్ కలిగిన ఇతరుల పేరిట ట్రైజరీ నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ప్రతీ ప్రభుత్వ అధికారి కారులో నెలలో 2,500 కిలో మీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇందుకు డ్రైవర్ వేతనం, ఇంధన ఖర్చుతో కలిపి మొత్తం రూ.33వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 100కు పైగా అద్దె వాహనాల దందా నడుస్తోంది. వీటికి ప్రతినెలా రూ.33వేల చొప్పున రూ.33లక్షల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తుండడంతో ఒక్కో వాహనానికి చెల్లించాల్సిన బీమా, ఫిట్‌నెస్ నెలకు రూ.లక్షల్లో రవాణాశాఖ ఆదాయం కోల్పోతోంది.
ఉపాధికి కత్తెర
ప్రభుత్వ అధికారుల అద్దె కార్లకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పుడు.. కారు బిల్లులు కాజేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. బ్యాంక్ రుణా లు, సబ్సిడీ, కార్పొరేషన్లతో పాటు ఓనర్ కం డ్రైవర్ వంటి స్కీం, దళిత బంధు పథకాల్లో నిరుద్యోగ యువత ట్యాక్సీ ప్లేట్‌కార్లు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం గిరాకీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొందరు కార్లు అమ్ముకుంటున్నారు.
బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్
విధులకు వినియోగిస్తున్న సొంత కారు
కౌటాల తహసీల్దార్ ప్రమోద్‌కుమార్ విధులకు వచ్చింది ఈ సొంత కారులోనే..
కౌటాల తహసీల్దార్ ప్రమోద్‌కుమార్ కాగజ్‌నగర్ నుంచి సొంత కారులో తానే డ్రైవ్ చేస్తూ విధులకు హాజరవుతున్నారు. బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్ కూడా ప్రభుత్వ విధులకు సొంత కారునే వినియోగిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఉంటూ బెజ్జూర్‌కు సొంత వాహనంలో వస్తారు. ఇలా జిల్లాలో చాలా మంది అధికారులు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో ట్యాక్సీప్లేట్ కార్లు నడిపేవారికి ఉపాధి లేకుండా పోతోంది.


