ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన క్షిప్రావధానం ఆకట్టుకుంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన తెలుగు పండితులకు ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా అష్టావధాని మాడుగుల నారా యణమూర్తి క్షిప్రావధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముదు బాల రాజేంద్రప్రసాద్ సంచాలక అధ్యక్షుడిగా వ్యవహరించగా, డీఆ ర్పీ నల్లగొండ సత్యనారాయణ సమన్వయం చేశారు. అవధాన పద్యాలతో సభ ప్రారంభమైంది. తొలుత రాజేంద్రప్రసాద్ అవధానాల విధివిధానాలు, తీరుతెన్నులు, క్షిప్రావధానం ప్రత్యేకత గురించి వివరించారు. తెలుగు పండితురాలు భువనేశ్వరి అప్రస్తుత ప్రసంగం, అర్థవంతమైన ప్రశ్నలతో భావస్పోరక హా స్య, వ్యంగ్య సమాధానాలతో సభను రంజింపజేశారు. పుష్పలత వ్యస్తాక్షరిగా, వెంకటాద్రి న్యస్తాక్షరి పృచ్చకులుగా ప్రశ్నించారు. కార్యక్రమం ఆధ్యంతం రసవత్తరంగా సాగింది. ఏసీఎంవో పుర్క ఉద్దవ్, కోర్సు డైరెక్టర్ కొడం రవీందర్, తెలుగు పండితులు పాల్గొన్నారు.


