తాండూర్: భీమిని పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాండూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి భీమిని మండలం రాంపూర్ శివారులో తనిఖీ నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ శివారులో తనిఖీ నిర్వహించగా రెండు బైక్‌లపై గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు క్యాన్ల, 10 ప్యాకెట్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్యాన్లలో రూ.1.04 లక్షల విలువ కలిగిన 210 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండ రాజు, బట్టుపల్లికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన రుకుం వెంకటేశ్, పల్లె రవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహా రాష్ట్రలోని రాజురాలో గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలోని రైతులకు అమ్మడానికి ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందును ఎవరైన విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ దేవయ్య, ఎస్సైలు కోటేశ్వర్, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.


