స్నేహితురాలి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు అభ్యసించా
ఆసిఫాబాద్‌అర్బన్: పేద కుటుంబానికి చెందిన నేను బడికి వెళ్లినపుడు నా స్నేహితురాలు అంజలి పెన్సిళ్లు, నోట్‌బుక్స్, డ్రెస్సులు ఇస్తూ ప్రోత్సహించేది. తన ప్రోత్సాహంతోనే నేను బీఏ, బీఈడీ చదివాను. 10వ తరగతి వరకు తబలాపూర్‌లో ఇద్దరం కలిసే చదివాం. బడికి వెళ్లే దారి మధ్యలోని పెద్దవాగును జంటగా దాటే వాళ్లం. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాలపై మక్కువతో 2024లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశాను. ప్రస్తుతం అంజలి తన కుటుంబంతో ఆదర్శ గృహిణిగా జీవిస్తోంది. ఎవరికి సమస్య వచ్చినా ఫోన్‌లో ఒకరికొకరం భరోసా కల్పించుకుంటాం. నిజమైన స్నేహానికి కులాలు, మతాలు, ధనిక, పేదరికం ఏవీ అడ్డురావు. ఇందుకు మా స్నేహమే నిలువెత్తు నిదర్శనం. – అంజలితో ఆత్రం సుగుణ
మనల్ని అర్థం చేసుకుని.. కష్టాల్లో ధైర్యం చెప్పి.. సంతోషాన్ని రెట్టింపు చేసేవారే స్నేహితులు. కాలం మారినా, దూరం పెరిగినా.. కష్ట, సుఖాల్లో తోడుగా నిలిచేవారే మిత్రులు. జీవితమనే ప్రయాణంలో ప్రతీ అడుగులో అండగా ఉండేవారు దోస్తులు.. రక్తసంబంధం కాకపోయినా హృదయాలను కలిపే అనుబంధమే స్నేహం.. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఆర్డీవో తదితరులు వారి స్నేహ సంబంధాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..


