పెంచికల్‌పేట్: పెద్దవాగు, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో పంట నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకట్ అన్నారు. పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ గ్రామంలో పెద్దవాగు వరదలతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం రైతులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు సాగులో జాగ్రత్తలు వహించాలన్నారు. చేలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వేరు కుళ్లు తెగులు రాకుండా మందులు పిచికారీ చేయాలని సూచించారు. ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట సర్పంచ్ రాజేశ్వరి, ఏవో రామకృష్ణ, ఏఈవో వంశీ తదితరులు ఉన్నారు.


