రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా జూలైలో 153 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం శ్రీరమేశ్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. గడిచిన నెలలో బెల్లంపల్లి ఏరియాకు 1.93 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.95 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయికి మించి ఉత్పత్తి చేపట్టామని వివరించారు. నెలాఖరులో మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు ఏరియా సుమారు 25 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి కోల్పోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9.93 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా.. 12.34 లక్షల టన్నుల(124 శాతం) ఉత్పాదకతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, సీనియర్ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


