ఆసిఫాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ ఆర్డీవో కృష్ణయ్యతో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి సంస్థ అధికారులు సర్వీస్ రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రాంగ్‌రూట్, యూ టర్న్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా అడ్డంగా ఉన్న విద్యుత్‌స్తంభాలు, మూలమలుపుల వద్ద చెట్లపొదలు తొలగించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పాఠశాలల బస్సులను నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు.
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
సమాజాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలకు 400 మీటర్ల దూరంలో గుట్కా, సిగరేట్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశించారు. డీఎస్పీలు వహీదుద్దీన్, అశోక్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్‌వో సీతారాం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి అశోక్ పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నాటికి బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా, క్యూర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. హెచ్‌ఐవీ బాధితులు, పాజిటివ్ నెట్‌వర్క్ సభ్యులకు సంక్షేమ పథకాల ద్వారా సహాయాన్ని అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో సీతారాం జిల్లాలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సేవలపై నివేదికను సమర్పించారు. క్లినికల్ నిపుణులు డాక్టర్ విజేత వ్యాధి నివారణ, నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


