ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేకుండా ఆగస్టులో ఒకేసారి మూడు నెలల కోటా సరఫరా చేసేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ఈ కేవైసీ గడువును సైతం ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు జిల్లాలో 82శాతం ఈ కేవైసీ పూర్తయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో తిర్యాణి తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి దిగుమతి, పంపిణీపై డీలర్లు అభ్యంతరం తెలిపినా.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే..
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 13,387 అంత్యోదయ కార్డులు, 1,52,135 ఆహార భద్రత కార్డులు, 20 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. 5,45,046 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి ఆరు కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలలకు కలిపి 10,125.407 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలోని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. దీని కోసం పౌరసరఫరాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదాంల నుంచి సన్నబియ్యం తరలింపు ప్రారంభమైంది.
పంపిణీకి ఏర్పాట్లు
ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆగస్టు 31 వరకు రేషన్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేషన్‌కార్డుదారులు ఈ నెల 31లోగా ఈ కేవైసీ తప్పని సరిగా చేయించుకోవాలి. రేషన్ షాపుల్లో నిల్వ సామర్థ్యం తనిఖీ చేసి, ఆ మేరకు బి య్యం సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.
– మహ్మద్ సాజీద్ హుస్సేన్, డీసీఎస్‌వో


