కాగజ్‌నగర్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్ బెడ్లను శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లకుండా స్థానికంగా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదు బెడ్లు అదనంగా రావడంతో కిడ్నీ రోగులు ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాలలో 5, సిర్పూర్‌లో 5, కాగజ్‌నగర్‌లో 10 డయాలసిస్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ సిబ్బంది సకాలంలో జీతాలు పొందుతున్నా కో పేమెంట్ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నూతనగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


