పెంచికల్‌పేట్: మండలంలోని మురళీగూడ, జిల్లెడ గ్రామాల్లో గురువారం వీధి కుక్కల దాడిలో నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వారిపై, పనులు చేసుకుంటున్న వారిపై కుక్కలు దాడి చేశాయి. దాడుల్లో గ్రామానికి చెందిన పొర్తెటి గౌరుబాయి, కొడప చాలుబాయి, సిడె రమేశ్, ఆత్రం కమలాబాయిలు గాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఒర్రెలు పొంగి ప్రవహిస్తుండటంతో గాయపడ్డవారికి వైద్యం అందే పరిస్థితి లేదు. గాయపడ్డ వారిని సర్పంచ్ పొర్తెటి వెంకటేశ్ పరామర్శించారు.
కొట్టుకుపోయిన
నాటు పడవలు
కోటపల్లి/వేమనపల్లి: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో వేమనపల్లి, కల్మల్‌పేట గ్రామాలకు చెందిన మత్స్యకారుల 27 పడవలు వరద ప్రవాహానికి తాడు తెంచుకొని కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు పడవల కోసం ఇంజిన్ పడవ సాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మండలంలోని వెంచపల్లి గ్రామ సమీపంలో రెండు కొండల మధ్య పడవలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు.


