ఆసిఫాబాద్‌అర్బన్: అర్హులైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించడం, చనిపోయిన వారు, అనర్హులను జాబితా నుంచి తొలగించడం, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇంకా పూర్తికావడం లేదు. ఓ వైపు అధికారులు ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే సరుకుల పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నా.. అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ నంబర్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 2014లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు గడువుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతుందడగా ఇప్పటివరకు 81శాతం ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన రెండు రోజుల్లో 20శాతం పూర్తి చేసేందుకు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,65,564 రేషన్ కార్డులు ఉండగా, 5,44,486 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. ఇందులో 4,42,032 మంది ఈ కేవైసీ పూర్తికాగా, మరో 1,02,454 చేయించుకోవాల్సి ఉంది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానితోపాటు ప్రతీ లబ్ధిదారులు సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈ– పాస్ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. రేషన్‌కార్డు నంబర్, ఆధార్ నంబర్ సరిచూసుకోవాలి. ఆకుపచ్చ రంగు లైట్ వస్తే సభ్యుల కేవైసీ పునరుద్ధరణ పూర్తయినట్లే.. రేషన్ కార్డు, ఆధార్ నంబర్లు సరిపోకపోతే రిజెక్ట్‌గా ఎరుపు రంగు చూపుతుంది. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తికాని వారి జాబితాను అధికారులు రేషన్ డీలర్లకు పంపించారు. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని, గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లా వివరాలు
మండలం లబ్ధిదారులు ఈకేవైసీ పెండింగ్
పూర్తి
ఆసిఫాబాద్ 56,884 47,536 9,348
బెజ్జూర్ 31,687 26,639 5,048
చింతలమానెపల్లి 32,719 27,294 5,425
దహెగాం 29,511 24,514 4,797
జైనూర్ 34,152 26,087 8,065
కాగజ్‌నగర్ 1,11,385 89,287 22,098
కెరమెరి 35,975 27,505 8,470
కౌటాల 36,891 30,438 6,453
లింగాపూర్ 13,402 10,610 2,792
పెంచికల్‌పేట్ 16,648 13,585 3,063
రెబ్బెన 35,028 29,893 5,135
సిర్పూర్(టి) 29,205 24,364 4,841
సిర్పూర్(యు) 17,367 13,613 3,754
తిర్యాణి 23,850 17,935 5,915
వాంకిడి 39,782 32,632 7,150
వందశాతం పూర్తికి చర్యలు
రేషన్‌కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఇప్పటివరకు జిల్లాలో 81శాతం పూర్తయ్యింది. గడువులోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇంటర్‌నెట్ లేని గ్రామాలకు సిబ్బంది వెళ్లి ఈ కేవైసీ చేపడుతున్నారు.
– మహ్మద్ సాజిద్ హుస్సేన్, డీసీఎస్‌వో


