ఆసిఫాబాద్: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(ఎస్‌ఐఆర్) తుదిదశకు చేరుకుంది. ఓటరు జాబితా సవరణతోపాటు సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ చివరిదశలో ఉంది. జిల్లాలో 678 పోలింగ్ స్టేషన్లు, 4,55,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 4,07,020 ఓటర్లు డిజిటలైజేషన్ ప్రక్రియ 99.86 శాతం పూర్తయింది. మరో 0.14 శాతమే పూర్తి చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ డివిజన్‌లో వందశాతం డిజిటలైజేషన్ పూర్తి కాగా, కాగజ్‌నగర్‌లో 99.72 శాతం పూర్తయింది. రెండు డివిజన్లలో పురోగతి సంతృప్తికరంగా ఉంది. ఆగస్టు 10 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
బూత్‌లో 1200 మంది ఓటర్లు
ఒక్కో పోలింగ్ బూత్‌లో 1200 ఓటర్లు ఉండేలా రేషనలైజ్ చేయనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఆసిఫాబాద్ డివిజన్‌లో లక్ష్యం చేరుకోగా, కాగజ్‌నగర్ డివిజన్‌లో 0.28 శాతమే పూర్తికావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ప్రతీ బూత్‌లోనూ జాబితా అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాల స్వీకరణకు 7 నుంచి 10 రోజుల గడువు ఉంటుంది. కొత్త ఓటు నమోదుకు ఫాం– 6, పేరు తొలగింపునకు ఫాం– 7, పేరు చిరునామా, వయస్సు సవరణకు ఫాం– 8 ఇస్తే బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. అన్ని రకాల అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 12న తుదిఓటరు జాబితా ప్రదర్శిస్తారు. తుదిజాబితా ప్రకారం కొత్త ఓటర్లకు ఈ ఎపిక్, పాత వారికి అప్‌డేట్ చేసిన కార్డులు అందజేస్తారు.
అభ్యంతరాలు సమర్పించాలి
ఆసిఫాబాద్ డివిజన్‌లో 2,03,532 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసి, 23,148 మంది ఓటర్లను డబుల్ కింద ఆన్‌లైన్ చేసి, 2,26,680 మంది ఓటర్ల వివరాలను ఆన్‌లైన్ చేశాం. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే సమర్పించాలి. ఆగస్టు 10 తర్వాత క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లు సమర్పించవచ్చు. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం.
– లోకేశ్వర్‌రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్


