ఆసిఫాబాద్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యల తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ధర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ద్వారా 2025– 26 సంవత్సరానికి ద్విచక్ర, త్రిచక్ర వాహన లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. 491 మంది గిరిజన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోగా 26 మందిని ఎంపిక చేశారు. వీరికి 21 ద్విచక్ర వాహనాలు, మిగిలిన వారికి త్రిచక్ర వాహనాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
గడువులోగా డిజిటలైజేషన్ పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారి వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. ప్రతీ వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.


