గోడు వినండి.. గోస తీర్చండి | - | Sakshi
Sakshi News home page

గోడు వినండి.. గోస తీర్చండి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

● ప్రజావాణిలో బాధితుల వినతులు

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకుని.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) ఎం.డేవిడ్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. డీఆర్‌వో వేణుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌కు చెందిన డోంగ్రె విమల తన కుమార్తెకు భూదానం కింద ఇచ్చిన భూమికి పట్టా పాస్‌పుస్తకం జారీ చేయాలని కోరింది. జైనూర్‌కు చెందిన కుటికెల శివాజీ మండల కేంద్రంలో అదనంగా మరో మీసేవ కేంద్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్‌నగర్‌ మండలం దుర్గానగర్‌కు చెందిన సచిన్‌ మేసీ్త్ర తాను సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టా పాస్‌బుక్‌ మంజూరు చేయాలని విన్నవించాడు. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన నాయిని లక్ష్మయ్య తన పట్టా భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. రెబ్బెన మండలం నారాయణపూర్‌కు చెందిన కాటిపెల్లి కొండయ్య తన తండ్రి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పని చేస్తూ మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. సిర్పూర్‌–టి మండలం అచ్చెల్లికి చెందిన అలం చిరంజీవి తను సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి నక్షా జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. సిర్పూర్‌– టి మండలం పారిగాంకు చెందిన జుంగరి నిర్మలాబాయి ఆసరా పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. వీరితో పాటు పలువురు అధికారులకు సమస్యలు ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement