ఆసిఫాబాద్: మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేయాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మొబైల్ రికవరీ మేళాలో రూ.23,40,000 విలువైన 117 మొబైల్ ఫోన్ల ను బాధితులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్లు, పాస్‌వర్డ్‌లతో పాటు విలువైన సమాచారాన్ని ఫోన్లలో భద్రపరచుకుంటున్నారని గ్రహించే నేరగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీక్ పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. దొంగిలించిన ఫోన్లను తెలిసి కూడా కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. సెకెండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేవారు విధిగా షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


