కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, వైద్య సిబ్బంది కొరత వెంటనే తీర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ అవినాష్‌తో జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులు, రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. భూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చెందినా ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేవన్నారు. ఆసుపత్రిలో 20 మంది వైద్యులు ఉండాల్సిన స్థానంలో నలుగురు మాత్రమే ఉన్నారని, ఆపరేషన్ థియేటర్ కూడా పని చేయకపోవడంతో సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమైందన్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్, ఆనంద్ కుమార్, రాజేందర్, పి.రాజేశ్, మిట్టపల్లి సుదర్శన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


