అపార చిక్కులు..! | - | Sakshi
Sakshi News home page

అపార చిక్కులు..!

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

జిల్లాలో 53.57 శాతమే పూర్తి వివరాలు సరిపోలకపోవడంతో నమోదులో జాప్యం తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జిల్లాలో 95,533 మంది విద్యార్థులు

వాంకిడి: ‘వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌ ఐడీ’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అపార్‌’(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్కూల్‌ రికార్డుల్లో ఉన్న విద్యార్థుల వివరాలు ఆధార్‌ కార్డుతో సరిపోలకపోవడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘అపార్‌ ఐడీ’ విధానాన్ని 2023లో అధికారికంగా ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నెలకొంటున్న ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. మూడేళ్లు కావొస్తున్నా పూర్తి కాలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్య అధికంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి మొత్తం 95,533 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 51,179 మందికి మాత్రమే అపార్‌ ఐడీలు జనరేట్‌ అయ్యాయి.

ఆధార్‌ – పాఠశాల రికార్డుల్లో తేడాలు

క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఆధార్‌ సంబంధిత పొరపాట్లతో జిల్లాలో ఇప్పటివరకు 53.57 శాతం మంది విద్యార్థులకు మాత్రమే ఐడీలు జనరేట్‌ అయ్యాయి. విద్యార్థుల వివరాలు సరిపోలకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఆధార్‌ కార్డులోని వివరాలు, పాఠశాల రికార్డుల్లోని(యూడైస్‌ ప్లస్‌) వివరాలు వేర్వేరుగా ఉంటున్నాయి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, తండ్రి పేర్లలో తేడాలు ఉంటున్నాయి. రెండింటిలోనూ చిన్నపాటి స్పెల్లింగ్‌ తేడా ఉన్నా ఐడీ జనరేట్‌ కావడం లేదు. ఆధార్‌లో సవరణలు చేపట్టాల్సి రాగా, ఆ మార్పుల ప్రక్రియ సైతం ఆలస్యమవుతోంది. చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలను సరిదిద్దాలంటే జనన ధ్రువీకరణ పత్రం అవసరమవుతుంది. దీనికోసం పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దానికి అడ్వకేట్‌ అఫిడవిట్‌తో పాటు పలు పత్రాలను జతపరిచి ‘నాన్‌ అవైలబిలిటీ’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది తహసీల్దార్‌, ఆర్డీవోల నుంచి అప్రూవల్‌ వచ్చాకే బర్త్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. దానికి కనీసం నెల రోజులైనా సమయం పడుతుందని తెలుస్తోంది. ఏదైనా కారణంతో దరఖాస్తు పెండింగ్‌లో పడితే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు విద్యాశాఖ పోర్టళ్లకు, ఆధార్‌ వెరిఫికేషన్‌ పోర్టళ్లకు మధ్య సమన్వయ లోపాలు తలెత్తుతున్నట్లు సమాచారం.

తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి..

విద్యార్థులకు అపార్‌ ఐడీని నమోదు చేసే క్రమంలో వారి తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా సమ్మతి(అనుమతి) పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక లేఖపై తమ పిల్లలకు అపార్‌ ఐడీ కేటాయించడాన్ని అనుమతిస్తున్నట్లు సంతకం చేసి ఇవ్వాలి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. తల్లిదండ్రుల నుంచి అనుమతి లేకపోతే అపార్‌ ఐడీ కోసం బలవంతం చేయకూడదని ఆదేశించింది. వివరాల నమోదులో సమ్మతిని నిరాకరించేందుకు, ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించేలా సవరణలు చేపట్టాలని సూచించింది. దీంతో ఐడీల నమోదు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12 అంకెల డిజిలాకర్‌..

జిల్లాలో అపార్‌ నమోదు వివరాలు

మండలం విద్యార్థులు నమోదు పెండింగ్‌

ఆసిఫాబాద్‌ 14,915 8,412 6,503

బెజ్జూర్‌ 4,455 1,824 2,631

చింతలమానెపల్లి 4,360 1,880 2,480

దహెగాం 4,162 2,115 2,047 జైనూర్‌ 7,670 4,313 3,357

కాగజ్‌నగర్‌ 21,856 13,630 8,226

కెరమెరి 5,229 3,030 2,199

కౌటాల 5,924 2,605 3,319

లింగాపూర్‌ 1,575 715 860

పెంచికల్‌పేట్‌ 2,313 1,300 1,013

రెబ్బెన 5,441 3,016 2,425

సిర్పూర్‌(టి) 6,254 3,384 2,870

సిర్పూర్‌(యు) 2,684 1,147 1,540

తిర్యాణి 3,125 1,188 1,937

వాంకిడి 5,567 2,620 2,947

మొత్తం 95,533 51,179 44,354

నూతన విద్యావిధానం– 2020 కింద విద్యార్థులకు ఒక జీవితకాల స్టూడెంట్‌ ఐడీ రూపొందిస్తారు. ఈ అపార్‌ ఐడీ విద్యార్థులకు 12 అంకెల డిజిలాకర్‌లా ఉపయోగపడుతుంది. ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి ఉన్నత చదువుల వరకు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట నిక్షిప్తమై ఉంటాయి. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తులు చేయాలన్నా ప్రస్తుతం ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ ప్రతుల ఫైళ్లను పట్టుకుని తిరగాల్సి వస్తోంది. కానీ ఈ అపార్‌ ఐడీ నమోదు చేసుకుంటే విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట లభ్యమవుతాయి. 12 అంకెల అపార్‌ డిజిలాకర్‌ నంబరును ఎంటర్‌ చేయగానే అన్ని ధ్రువపత్రాలను చూసుకునే వీలుంటుంది. జిరాక్స్‌ ప్రతులతో తిరగాల్సిన అవసరం ఉండదు.

అవగాహన కల్పిస్తున్నాం

విద్యార్థుల ఆధార్‌ కార్డులోని వివరాలు, పాఠశాల రికార్డుల్లోని వివరాలు సరిపోలకపో వడంతోనే అపార్‌ ఐడీల నమోదులో జాప్యం జరుగుతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అన్ని ప్రధానోపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్‌ కార్డులో ఉన్న తప్పిదాలను వెంటనే సవరించుకోవాలి. – సచ్చిదానంద చారి, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement