‘భూభారతి’ రీసర్వేకు తొలిదశలో 70 గ్రామాలు ఎంపిక రికార్డులు సక్రమంగా లేని మరో 37 గ్రామాల్లో సైతం.. జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభలు ఇక పక్కాగా హద్దులు.. తొలగనున్న వివాదాలు
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్‌లో వచ్చిన తప్పులు, పెండింగ్ వివాదాలు, సర్వే నంబర్ల గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశ్యంతో భూ భారతి రీసర్వేకు శ్రీకారం చుట్టింది. భూమి హద్దులు, యాజమాన్యంతోపాటు మ్యాపులు కచ్చితంగా గుర్తించి, డిజిటల్ ప్రక్రియ చేపట్టనున్నారు. దశల వారీగా సర్వే చేపట్టనుండగా, తొలి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 15 మండలాల్లో 70 గ్రామాలను ఎంపిక చేశారు. అలాగే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లోని సర్వే రికార్డులు సక్రమంగా లేని 37 గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతీ మండలంలో 4 నుంచి 5 గ్రామాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిదశలో ఆసిఫాబాద్ మండలంలోని దానాపూర్, సీతానగర్ గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. పాత రోజుల్లో గొలుసు, కర్రలతో భూములు కొలిచేవారు. ప్రస్తుతం డిజిటల్ సర్వే చేపట్టేందుకు జిల్లాకు 10 డీజీపీఎస్ మిషన్లు కేటాయించారు. శాటిలైట్ సిగ్నల్‌తో సెంటిమీటర్ కచ్చితత్వంతో భూమి అక్షాంశ, రేఖాంశాలు కొలువనున్నారు. ఆకాశం నుంచి మొత్తం గ్రామానికి ఒకేసారి ఫొటోలు తీసి, డిజిటల్ మ్యాప్, త్రీడీ సర్ఫేస్ తయారు చేసేందుకు అవకాశం ఉంది.
కొనసాగుతున్న గ్రామసభలు
రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యేందుకు ఈ నెల 16 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లో రెవెన్యూ శాఖ సిబ్బందికి మండలానికి ఒకరికి చొప్పున సర్వేపై శిక్షణ ఇస్తున్నారు. భూమి హద్దులు, ఉన్న రికార్డులు, సర్వే నంబర్లు, ఆక్రమణల వంటి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో కొలతలు తీసి మ్యాప్‌లు, పార్సిళ్లు సిద్ధం చేస్తారు. భూముల హద్దులు, యాజమాన్య వివరాలు, రికార్డులు ఒకే పద్ధతిలో నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో సర్వే చేపడుతున్నారు. గ్రామ సభలు, ఫీల్డ్ సర్వే, డ్రోన్, జీపీఎస్ ఆధారిత కొలతలు, ఫీల్డ్ వెరిఫికేషన్, డ్రాఫ్ట్ రికార్డులు, అభ్యంతరాలు పరిష్కారం వంటి పనులు చేపట్టనున్నారు. అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది రికార్డులు, మ్యాపులు, భూవివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు.
రైతులు అందుబాటులో ఉండాలి
జిల్లాలోని 15 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద 70 గ్రామాలను ఎంపిక చేశాం. రికార్డులు సక్రమంగా లేని మరో 37 గ్రామాలను సైతం సర్వే కొనసాగుతుంది. గ్రామ సభలు, భూ కొలతల సమయంలో రైతులు అందుబాటులో ఉండాలి. సిబ్బందికి సహకరించాలి. రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయి.
తొలిదశ గ్రామాలివే..
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద తొలి దశలో 70 గ్రామాలను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ మండలం గుడిగుడి, గోవింద్‌పూర్, మేకలవాడ, కేస్లాపూర్, పిప్పల్‌గోంది, జైనూర్ మండలం పొలాస, జామ్ని, దుబ్బగూడ, జైనూర్, పవార్‌గూడ, కెరమెరి మండలం మురికిలంక, పార్డా, నాగాపూర్, పిప్పిరి, సాకడ, లింగాపూర్ మండలం గుమ్నూర్– కె, వంకమాడి, గుమ్నూర్– బి, కంచెపల్లి, రెబ్బెన మండలం ఫకీర్‌పల్లి, గుడిపల్లి, మేడిగూడ, సీతానగర్, రంగాపూర్, సిర్పూర్– యు మండలం భూనూర్, చాప్రి, దేవుడిపెల్ల, కోహినూర్, మహాగామ్, వాంకిడి మండలం నూకెవాడ్, బోరంజిగూడ, దేవుడిపల్లి, అకిని, చించోలి, తిర్యాణి మండలం తలండి, రాళ్లకన్నెపల్లి, దుగ్గాపూర్, చింతపల్లి, గంగాపూర్, బెజ్జూర్ మండలం రేచిని, నాగెపల్లి, సుశ్మీర్, గబ్బాయి, చింతలమానెపల్లి మండలం బాలాజీఅనకొడ, చిట్టమ్, కోర్సిని, కోయపల్లి, దహెగాం మండలం అమరగొండ, రావులపల్లి, దుబ్బగూడ, తీపర్‌గాం, కాగజ్‌నగర్ మండలం నారాపూర్, దుబ్బగూడ, లంజన్‌గూడ, మారెపల్లి, బోరిగాం, కౌటాల మండలం బాలెపల్లి, సడ్గాం, వీరపల్లి, తలండి, నాగెపల్లి, పెంచికల్‌పేట్ మండలం గొంట్లపేట్, జిల్లెడ, నందిగామ్, పెంచికల్‌పేట్, సిర్పూర్– టి మండలం చుంచుపల్లి, హీరాపూర్, జక్కాపూర్, టోంకిని, వెంకట్రావ్‌పూట్ గ్రామాలను ఎంపిక చేశారు. వీటితో పాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలోని రికార్డులు సక్రమంగా లేని 37 గ్రామాలను ఎంపిక చేశారు. దశలవారీగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు.


