నేటి నుంచి పదోతరగతి పరీక్షలు హాజరుకానున్న 6,949 మంది విద్యార్థులు జిల్లాలో 38 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆసిఫాబాద్‌రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లలిత తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు.
ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డీవోలు, 38 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 2, ఒక్కో బృందానికి ముగ్గురు అధికారులతో పాటు 500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. దీంతో పాటు పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ప్రతీ సెంటర్‌ను కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈవో, ఎంఈవో, ఒక పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. విద్యార్థులు ఫోన్లు, ఇతర సామగ్రి భద్రపర్చుకోవడానికి పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేశారు. ఎండల తీవ్ర నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో చల్లటి నీరు. అవసరం ఉన్న చోట టెంట్‌లు ఏర్పాటు చేశారు
జిల్లాలో 38 సెంటర్లు..
జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు గానూ 38 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేట్ విద్యార్థుల కోసం 5, రెగ్యులర్ విద్యార్థుల కోసం 33 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లో 8, ఆసిఫాబాద్‌లో 5, కెరమెరిలో 2, సిర్పూర్(టి)లో 3, రెబ్బెనలో 3, జైనూర్, వాంకిడి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, తిర్యాణి, చింతలమానెపల్లిలో రెండేసిసెంటర్లు, పెంచికల్‌పేట్‌లో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు.
నిర్భయంగా పరీక్ష రాయాలి
విద్యార్థులు ఎలాంటి ఒత్తి డి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్ష రా యాలి. భయం లేకుండా ప రీక్షలు రాస్తే మంచి మార్కులు సాధిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– లలిత, డీఈవో


