కొత్త నిబంధనలతో కూలీలకు తిప్పలు నాలుగు గంటలకు పైగా పని ప్రదేశంలో ఉండాల్సిందే.. వేసవి మొదలైనా సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్న పనులు
ఉపాధిహామీ..
తిర్యాణి: ఉపాధిహామీ పథకంలో నూతనంగా అమలు చేస్తున్న నిబంధనలు కూలీలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకత కోసం తీసుకువచ్చిన మార్పులతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు రెండుసార్లు హాజరు వేయాల్సి రావడంతో కూలీలు ఎక్కువ సమయం పని ప్రదేశంలో గడుపుతున్నారు. ఎండలు పెరిగినా అధికారులు మాత్రం వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. తాగేందుకు నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు.
1,61,268 మంది కూలీలు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కనీస ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో 2005లో ప్రత్యేక చట్టం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం ప్రారంభమైన నాలుగేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్‌వేర్‌తో నిర్వహించారు. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన కేంద్ర ప్రభుత్వం పథకం పేరును వీబీ జీ రామ్‌జీగా మార్చి నూతన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో ఉన్న వందరోజుల పనిదినాలను సైతం 125 రోజులకు పెంచారు. జిల్లాలో 88,721 యాక్టీవ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,61,268 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ దాదాపు 15 వేల మందికి పైగా కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు.
వేసవి భత్యం బంద్
పాత సాఫ్ట్‌వేర్ అమలు చేసిన సమయంలో కూలీల కు వేసవి భత్యం అందేది. ఫిబ్రవరి నుంచి జూన్ వ రకు వేతనంతోపాటు 20 శాతం నుంచి 35 శాతం వరకు అదనంగా చెల్లించేవారు. అలాగే పని ప్రదే శం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే కిలోమీటర్‌కు కొంత జమ చేసేవారు. పార, గడ్డపార వినియోగించినందుకు కూలీకు అదనపు భత్యం అందించేవారు. గతంలో గడ్డపారలు సైతం ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్టడం లేదు. వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై కూలీలు అనాసక్తి చూపుతున్నారు.
పని ప్రదేశంలోనే అధిక సమయం
వారం రోజులుగా ఎండలు పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతా పం చూపిస్తున్నాడు. గురువారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత జిల్లానే నమోదైంది. ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారదర్శకత కోసం ఆన్‌లైన్ ద్వారా కూలీల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కేవలం రోజుకు ఒక్కసారి ఫొటో తీసి అప్‌లోడ్ చేసేవారు. ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఫొటో తీస్తున్నారు. మొదటి ఫొటో తీసి అప్‌లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత మరో ఫొటో తీయాల్సి ఉంటుంది. దాదాపు నాలుగు గంటలకుపైగా పని ప్రదేశంలో కచ్చితంగా ఉంటున్నారు. పనిప్రదేశంలో మౌలిక సౌక్యరాల కల్పనకు ఆయా పంచాయతీలకు ఒక్కో కూలీ రూ.2.50 చొప్పున అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పని ప్రదేశాల్లో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్, తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కూలీలు ఎండలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకుంటున్నారు.


