సన్నగిల్లుతున్న ‘భరోసా’ | - | Sakshi
Sakshi News home page

సన్నగిల్లుతున్న ‘భరోసా’

Mar 5 2026 7:26 AM | Updated on Mar 5 2026 7:26 AM

పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువు అప్పులతో అన్నదాతల ఉక్కిరిబిక్కిరి

రెబ్బెన: పంటల సాగుకు పెట్టుబడులు, యాజమాన్య ఖర్చులు పెరగడంతో రైతులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. అన్నదాతలకు ఆర్థిక చేయూతను అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు సీజన్లకు అందిస్తామని ప్రకటించి గత వానాకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు కొనసాగుతోంది. జిల్లాలో ముందస్తుగా వేసిన పంటల దిగుబడి మరో రెండు నెలల్లో చేతికి అందనుంది. డిసెంబర్‌లో యాసంగి సీజన్‌ ప్రారంభంలో అందాల్సిన రైతుభరోసా సాయం ఇప్పటివరకు అందలేదు. గత యాసంగిలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఊరించి.. చివరికి పెట్టుబడిసాయం అందించకుండానే దాటవేసింది.

పెరిగిన పెట్టుబడి..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో యాసంగి సీజన్‌లో సుమారు 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తున్నారు. వానాకాలంలో సీజన్‌ ముగింపు సమయంలో కురిసిన అధిక వర్షాలతో ఈసారి చలితీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో సీజన్‌ మొదట్లో పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరినారు ఎదుగుదల లేకపోవడంతో రైతులు నారు పెంచేందుకు అపసోపాలు పడ్డారు. తీరా చలితీవ్రత తగ్గుముఖం పట్టాక వాతావరణంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పగలు ఎండలు, రాత్రి చలిగాలులు రైతులకు తలనొప్పిగా మారాయి. యాసంగి వరికి గతానికి భిన్నంగా తెగుళ్లు, పురుగు ఉధృతి ఉంది. ముందస్తుగా నాట్లు వేసిన చోట చలితో పైరులో ఎదుగుదల లేదు. రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు చల్లాల్సి వస్తోంది. దీనికితోడు సీజన్‌ ప్రారంభం నుంచి మొగిపురుగు, వేరుకుళ్లు తెగుళు, అగ్గితెగుళ్లు ఆశించడం క్రిమిసంహారక మందులను విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ఈసారి పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. రైతులు అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు లభించేది.

వానాకాలంలో 1,43,063 మంది

వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 1,43,063 మంది రైతులకు ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయం కింద రూ.2,66,86,59,662 నగదు అందించింది. యాసంగి సీజన్‌లో ప్రభుత్వం సాగులో ఉన్న భూములకు మాత్రమే అందించాలని భావించింది. దీనికోసం శాటిలైట్‌ ద్వారా భూముల లెక్క తేల్చాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వానాకాలంలో సాయం అందుకున్న రైతులందరికీ యాసంగిలో అందిస్తామని తెలిపింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కేబినేట్‌ మీటింగ్‌లో రైతుభరోసా చెల్లింపుపై చర్చిస్తారని భావించారు. కానీ సమావేశం ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. దీంతో యాసంగి పెట్టుబడిసాయం చెల్లింపుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది.

ఊరిస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద వానాకాలం పంటల పెట్టుబడి సాయం ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయగా.. యాసంగి సాయం అందించడంలో మాత్రం రైతులను ఊరిస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రైతుభరోసా అందిస్తారని భావించగా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎన్నికలు ముగియగానే రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. అయితే మున్సిపల్‌ ఎన్నికలు సైతం ముగిసినా ఉలుకుపలుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సీజన్‌ సగం పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో పంట దిగుబడి సైతం చేతికందుతుంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో అందించా ల్సిన సాయాన్ని సీజన్‌ పూర్తయ్యే దశకు చేరుకున్నా విడుదల చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్‌లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం రైతులను ఊరించి చివరికి పెట్టుబడి సాయాన్ని అందించకుండానే చేతులు దులుపుకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement