మార్చిలోనే భానుడి ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

మార్చిలోనే భానుడి ప్రతాపం

Mar 5 2026 7:26 AM | Updated on Mar 5 2026 7:26 AM

● జిల్లాలో క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● బుధవారం ఎల్కపల్లిలో 37.3 డిగ్రీలుగా నమోదు

కౌటాల: మార్చిలో భానుడు భగ్గుమంటున్నాడు. మూడు రోజులుగా వేసవి మంటలు తీవ్రమయ్యాయి. మార్చి ప్రారంభంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా, ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదవుతున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం మూడు రోజులుగా 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ తగ్గి ఉదయం 10 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. మరో వారంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఏటా మంటలే..

జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఏటా అధికంగా ఉంటోంది. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్‌గా పరిగణిస్తాం. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమయ్యాయి. అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు

(డిగ్రీ సెల్సియస్‌లో)

ప్రాంతం ఉష్ణోగ్రతలు

ఎల్కపల్లి 37.3

ఆసిఫాబాద్‌ 37.0

లోనవెల్లి 37.0

కౌటాల 36.9

బెజ్జూర్‌ 36.9

ధనోరా 36.8

రవీంద్రనగర్‌ 36.8

కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రెండు రోజుల క్రితం పని నిమిత్తం బైక్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కొంత అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడు. ఎండలో బైక్‌పై ప్రయాణించడంతో వడదెబ్బ తగిలిందని, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని సదరు వైద్యుడు సూచనలు చేశారు... కాగా, మార్చిలోనే వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉండగా, రానున్న రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement