ఆసిఫాబాద్: జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోనూ 1,737 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడించారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 34 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతో పాటు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం కాగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతుంది.
మొదలైన ఫ్యాన్లు, కూలర్ల వాడకం
రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమవుతుండంతో ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడడం ప్రారంభించారు. అలాగే అవసరాలకు అనుగుణంగా ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వినియోగం పెరిగింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం మద్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ డిమాండ్ ఏకంగా 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
సాగుకు బోర్ల వినియోగం
జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అవసరమైన సాగునీరందక రైతులు రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు. వేసవిలో సాధారణం కంటే అధికంగా విద్యుత్ పరికరాలు వినియోగించడంతో మీటర్లు స్పీడ్‌గా తిరిగి బిల్లులు పెరగనున్నాయి. గత నెల 25న 1.456 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఈ నెల 2న 1.735 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ లెక్కన వారం రోజుల్లోనే రోజుకు 0.279 మిలియన్ యూనిట్ల(17 నుంచి 18 మెగావాట్లు) విద్యుత్ వినియోగం పెరిగింది.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగం నియంత్రించేందుకు ప్రతీ ఇంట్లోనూ ఎల్‌ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచించారు. ఇన్వర్టర్ గృహాలకు తక్కువ వాట్స్ విద్యుత్ సాధనాలు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, వాటర్ హీటర్లు, టీవీలు ఆఫ్ చేయడం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలి. రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం సరైన సమయాల్లో నడపాలి. డిప్ బ్కో సోలార్ పంపుసెట్లు, సౌరశక్తి ఆధారిత పరికరాలు ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గించవచ్చు.


