విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘ప్రజాబాట’
దహెగాం: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రా న్స్‌కో ఎస్‌ఈ జాడే ఉత్తమ్ అన్నారు. మండలంలోని లగ్గాంలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ పొలాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉంటే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రైతులు 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంఆర్‌టీ సహాయక ఇంజినీర్ శ్రీనివాస్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీర్ వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.


