రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన అవసరమని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాలు వేగంగా నడిపితే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, హెచ్‌ఎం కవిత, ఉపాధ్యాయులు లక్ష్మణ్, హేమంత్ షిండే, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


